వైఎస్సార్ ఉచిత విద్యుత్తు పథకం కింద రైతులకు నగదు బదిలీ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నగదు బదిలీ విధానాన్ని తొలుత శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టింది సర్కార్. మిగిలిన జిల్లాల్లోనూ కమిటీల ఏర్పాటు, అవగాహన సదస్సులు జోరందుకున్నాయి. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టరేట్లో వైఎఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకం కమిటీల అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు.
కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఈపీడీసీఎల్ డైరెక్టర్ రమేష్ ప్రసాద్, వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తు పథకం జిల్లా స్థాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్ల బిగింపు పథకం విధివిధానాలు, అమలు తీరు తదితర విషయాలను కలెక్టర్ విపులీకరించారు. పథకం కమిటీకి సంబంధించిన పలువురు సభ్యుల సందేహాలను ఈపీడీసీఎల్ డైరెక్టర్ రమేశ్ ప్రసాద్ నివృత్తి చేశారు.