వ్యవసాయం...! ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకువచ్చేది... అన్నదాత కష్టాలే. పగలు, రేయి తేడా లేకుండా కష్టపడే కర్షకులు... అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఉత్పత్తుల్ని కొనుగోలు చేసే దళారులు, విక్రయించే వ్యాపారులు మాత్రం లాభాలు గడిస్తున్నారు. మంచి ఆదాయం సొంతం చేసుకుంటున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి.. అహర్నిశలు శ్రమించే రైతన్నలకు మేలు జరగాలంటే...అన్నదాతలు వ్యాపారులుగా మారాలని సూచిస్తోంది.. విజయనగరం జిల్లాకు చెందిన సిరి చందన. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న ఈ యువతి...భారత్ తరపున అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొని.. ఆధునిక వ్యవసాయ విధానాలపై అధ్యయనం చేసింది.
- బీఎస్సీ చదువు....యూఎస్‌లో అవకాశం
విజయనగరంజిల్లా గరివిడికి చెందిన ఉప్పు శ్రీనివాసరావు, ఉప్పు పార్వతీ దంపతుల కుమార్తె సిరి చందన. వృత్తిరిత్యా పార్వతీ ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు కాగా, శ్రీనివాసరావు ప్రైవేటుఉద్యోగి. మొదటి నుంచి చదువుల్లో మెరుగ్గా రాణిస్తున్న సిరిచందను ఇంటర్ తర్వాత ఎంబీబీఎస్ చదివించాలని ఆశించారు. సిరించదన ప్రస్తుతం ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నిర్వహిస్తున్న వైరా కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతోంది. పాఠ్యాంశాల్లోనే కాకుండా... వ్యవసాయ రంగంలోని సాంకేతికత పరిజ్ఞానమే సిరిచందనను అమెరికాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే స్థాయికి చేర్చింది. అందులోనూ ఆంగ్రూ పరిధిలో ఈమె ఒక్కరే ఎంపిక కావటం విశేషం. అమెరికాలోని ఓక్లహోమా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పాల్గొంది.
- ఐదు దశల ప్రతిభా పరీక్షలు..
గతేడాది జూన్ నుంచి ఆగస్టు వరకు రెండు నెలల పాటు జరిగిన ఈ సదస్సు ఎంపికకు విశ్వవిద్యాలయం తరపున ఐదు దశల ప్రతిభా పరీక్షలు నిర్వహించారు. వీటన్నింటిలోనూ ఉత్తీర్ణత సాధించి... విశ్వవిద్యాలయం తరపున ఓక్లహోమా వ్యవసాయ విశ్వవిద్యాలయ నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం దక్కించుకుంది.."వ్యవసాయ రంగం-ఎంటర్ ప్రైనర్ షిప్" అనే అంశంపై ప్రధాన అంశంగా సదస్సులో ప్రసంగించినట్లు సిరి చందన చెబుతోంది.
- మరిన్ని పరిశోధన చేయాలి..
భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధన చేయాలని.., ప్రధానంగా పోస్టు హర్వెస్టింగ్ (పంట కోత అనంతరం చేపట్టే విధానాలు) పై మేలైన విధానాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమంటోంది. అదేవిధంగా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ రంగంలో కూడా రాణించాలని ఆశిస్తోంది. ఇలా వ్యవసాయ పరిశోధన రంగంలోనే కాకుండా...నృత్యం, సభలు, సమావేశాలు, సదస్సులో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ అందరిని మెప్పిస్తోంది.
ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్.. ఉపాధి లేక.. వండ్రంగుల ఆకలి కష్టాలు