PM TOUR IN VISAKHA : ఈనెల 12న ఏయూలో జరిగే ప్రధాని సభకు 2 లక్షల నుంచి 3 లక్షల మందిని సమీకరించేలా అధికార వైకాపా కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్తరాంధ్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకూ బాధ్యులను నియమించింది. విశాఖ నగర పాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్లకు జనసమీకరణ లక్ష్యాలను నిర్దేశించింది.
సభకు ప్రజలను తరలించేలా సన్నాహాలు: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి జనాలను తరలించేలా సన్నాహాలు చేస్తోంది. ఏర్పాట్లను సమన్వయం చేస్తున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రత్యేక పర్యవేక్షక బృందాన్ని నియమించారు. వైకాపా విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నేతలతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం క్రీడా మైదానంతో పాటు ఎదురుగా ఉన్న మరో మైదానాన్నీ సిద్ధం చేయిస్తున్నారు.
ప్రధాని సభకు వైకాపా హడావుడి: జనాలను తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతోపాటు ఇతర వాహనాలను సమకూరుస్తున్నారు. ప్రధాని విశాఖ పర్యటన అధికారిక పర్యటన అయినందున రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నామని వైకాపా నేతలు ప్రకటిస్తున్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ వైకాపా నాయకులతో సమావేశాలు నిర్వహించి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ప్రధాని సభకు జన సమీకరణ జరిపేందుకు వైకాపా చేస్తున్న హడావుడి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల ఆధీనంలోకి ప్రధాని సభా ప్రాంగణం: ప్రధాని పర్యటన సందర్భంగా విశాఖలో ప్రతి కూడలి వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి వాహనం వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ప్రధాని సభా ప్రాంగణం పూర్తిగా ఇప్పటికే పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. వేర్వేరు ప్రాంతాలకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులకు మొత్తం నగరాన్ని సెక్టార్లుగా విభజించి తనిఖీల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఎక్కడా ట్రాఫిక్ వల్ల కాన్వాయ్‌కు ఇబ్బంది లేకుండా క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారులు ప్రణాళిక ప్రకారం పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు : మద్దిలపాలెంకు, వాల్తేర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి వెళ్లే మార్గాల్లోనూ ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతున్నాయి. 11 వ తేదీ పరిమితంగానూ, 12 వ తేదీ ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. స్థానికంగా తిరిగే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సభా స్థలి నుంచి 5కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా డ్రోన్లను ఉపయోగించరాదని, ఒకవేళ వాటిని గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు .
ఇవీ చదవండి: