విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయం నీటిమట్టం పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయంలోకి 184 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు కాగా, ప్రస్తుతం 97.80 మీటర్లు నీటి మట్టం ఉందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు.
కోనాం జలాశయం ఆయకట్టులో వరిసాగుచేస్తుంటారు. ప్రస్తుతం నారుమళ్లు వేశారు. ఈ నేపథ్యంలో జలాశయం సాగునీటి కమిటీ పాలకవర్గం సమావేశం ఏర్పాటుచేశారు. ఆగస్టు మొదటి వారంలో ఖరీఫ్ వరినాట్లకు నీరు విడుదల చేయాలని తీర్మానం చేసింది. దీంతో రైతులు వరినాట్లకు సన్నద్ధమవుతున్నారు. జలాశయం నుంచి చీడికాడతోపాటు మాడుగుల, బుచ్చయ్యపేట, చోడవరం, దేవరాపల్లి మండలాలకు చెందిన గ్రామాలకు సాగునీరు అందుతుంది. జలాశయం పరిధిలో 14,450 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది జలాశయంలో ఖరీఫ్ పంటలకు అవసరమైన నీటి నిల్వలు ఉన్నాయని జలాశయం సాగునీటి కమిటీ ఛైర్మన్ గండి ముసలినాయుడు తెలిపారు. జలవనరుల శాఖ అధికారులు స్పందించి ఆగస్టు మొదటి వారంలో సాగునీటిని విడుదల చేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి : కొవిడ్ ఆసుపత్రుల్లో సేవల కోసం 333 మంది వాలంటీర్ల ఎంపిక