ఎప్పటి లాగే ఆ గ్రామం రాత్రి నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో 40 రోజులు మూతపడిన ఆ రసాయన కర్మాగారం నిద్ర లేచింది. పునరుద్ధరణ కోసం చేపట్టిన పనులు ఆ ఊరి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు, పశువులు, పక్ష్యాదులు, చెట్టు చేమ అనే తేడా లేకుండా విష వాయువు కమ్మేసింది. కట్టేసిన మూగజీవాలు అలాగే జీవం కోల్పోయాయి. ప్రాణ వాయువును అందించే మొక్కలు విషవాయువు చేత చిక్కి మాడిమసయ్యాయి.
నిద్రలో నుంచి లేచిన కొందరు గ్రామస్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెడుతూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయి ఊరి బావిలో, మురుగు కాల్వలో పడిపోయారు. అక్కడే ముగ్గురు తుది శ్వాస విడిచారు. పదుల సంఖ్యలో ప్రజల వీధుల్లో పడిపోయారు. స్పృహ కోల్పోయారు. అనేకమంది ఇళ్లల్లో తలుపులు వేసుకుని పడుకున్న వారు పడుకున్న వారు పడుకున్నట్టే రసాయన గాలి ప్రభావంతో మగతలోకి వెళ్లిపోయారు.
పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చిక్కుబడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఎన్నో కుటుంబాలు కకావికలం అయ్యాయి. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఎవరు ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు..? అసలు ఉన్నారా..? అనే జాడ లేక తల్లడిల్లే గుండెలు అనేకం చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇదీ చదవండి