Vizag Did Not Develop During YCP Government: విశాఖ పాలనా రాజధాని అంటూ ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసిన వైసీపీ పాలకులు.. నగరానికి ఇప్పుడేదో చేస్తామంటూ హడావిడి చేస్తున్నారు. విశాఖ మెట్రోకు గత ప్రభుత్వ హయాంలో డీపీఆర్ దాదాపుగా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య విధానంలో దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రణాళికతో రుణ సాయానికి విదేశీ బ్యాంకులు సైతం సిద్ధమయ్యాయి. టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఫైనాన్షియల్ బిడ్‌ను రద్దు చేసింది. మళ్లీ కొత్త టెండరుకు వెళ్లాలని, డీపీఆర్ తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది.
నాలుగున్నరేళ్లు గడిచాక.. ఇప్పుడు తీరిగ్గా డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. నాలుగు కారిడార్లలో 54 స్టేషన్లు ఏర్పాటు చేస్తూ 76.90 కిలోమీటర్ల మెట్రో నిర్మాణం తొలివిడతలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే జనవరి 15న శంకుస్థాపన అంటూ మళ్లీ హోరెత్తిస్తున్నారు. డీపీఆర్ పరిశీలన పూర్తై, పనులు ప్రారంభించాలంటే చాలా సమయం పడుతుందని.. ఇది కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం చేస్తున్న మాయేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రం ‘రుషికొండ’ను బోడిగుండుగా మార్చి కోట్లు ఖర్చు చేసి అక్కడ భవనాల నిర్మాణం చేపట్టారు. సీఎం జగన్ కుటుంబం కోసమే ఉన్నవాటిని కూల్చి కొత్తవి నిర్మిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో ఆ నిర్మాణాలకు పర్యాటక రిసార్టుల అభివృద్ధి ముసుగు వేశారు.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దసరాకు విశాఖ నుంచే పాలన సాగిస్తామంటూ హడావుడి చేస్తున్నారు. హుద్‌హుద్ తుపాను తర్వాత కైలాసగిరిని అభివృద్ధికి 54కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం పనులు చేపట్టగా వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన జీ-20 సదస్సు నేపథ్యంలో అసంపూర్తి పనులు పూర్తిచేయడంతోపాటు నగరంలోని రహదారులు, పార్కుల సుందరీకరణ చేపట్టారు. 2019 డిసెంబర్‌లో 750కోట్ల విలువైన పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయగా ఇప్పటికి కేవలం వంద కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. ప్లానిటోరియం ప్రాజెక్టు సైతం చతికిలపడింది.
YCP Government Hastily Laid Foundations: ఈ నాలుగున్నరేళ్లలో విశాఖలో కొత్త ప్రాజెక్టులేవీ ముందుకు కదల్లేదు. ఇన్నాళ్లు అభివృద్ధిని విస్మరించిన సర్కారు ఇప్పుడు హడావిడిగా శంకుస్థాపనలు చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇటీవల బీచ్ రోడ్డులో సముద్రం లోపల 7 కోట్లతో ‘బీచ్ డెక్’ నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
- కైలాసగిరిపై సైన్సు సిటీ, బీచ్ రోడ్డులో కన్వెన్షన్ హాలు, ఐదు నక్షత్రాల రిసార్ట్, జల విన్యాసాలకు సంబంధించి క్రియేషనల్ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- ఆనందపురం మండలం గోరింటలో ఐదెకరాల్లో ఎక్సైజ్ కాంప్లెక్సు నిర్మాణానికి సెప్టెంబరు 28న శంకుస్థాపన చేశారు.
- కాపులుప్పాడలో 88కోట్లతో నేచురల్ హిస్టరీ పార్కు మ్యూజియానికి ప్రతిపాదన చేయగా, సంబంధిత డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వ పరిశీలనకు పంపారు.