విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్లాంట్ ఆర్చ్ వద్ద ఇవాళ వంద అడుగుల బ్యానర్ పట్టుకొని ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల పోరాట తీరును పోరాట కమిటీ చైర్మన్ సి.హెచ్ నర్సింగరావు కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో విశాఖ ఉక్కుపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామమన్నారు. ప్రభుత్వం.. అఖిలపక్ష కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో...
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట కార్మిక సంఘాలు ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లాలో...
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం చేయొద్దంటూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరసన ప్రదర్శన జరిగింది. విశాఖ ఉద్యమానికి వందరోజులు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: 'ఉక్కు పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం'