గంజాయి అక్రమ రవాణాకు విశాఖపట్నం అడ్డాగా మారుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ద్వారా విశాఖ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలించినట్లు ఇటీవలే బయటపడటం కలకలం సృష్టించింది. దాన్ని మరువక ముందే తాజాగా సోమవారం మరో రెండు సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశాఖ జిల్లా సీలేరు నుంచి తరలిస్తున్న 1,240 కిలోల గంజాయిని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి మహారాష్ట్రకు తీసుకొచ్చిన 1,127 కిలోల గంజాయిని నాందేడ్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) అధికారులు పట్టుకున్నారు.
నాందేడ్‌లో ఇద్దరి అరెస్టు..
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నైగావ్ తాలూకాలో మంజ్‌రామ్ ప్రాంతం వద్ద ఎన్‌సీబీ-ముంబయి అధికారులు సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ట్రక్కులో తరలిస్తున్న 1,127 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.5.63 కోట్లు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు విశాఖపట్నం నుంచి మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాకు గంజాయిని తీసుకెళ్తున్నట్లు తాము గుర్తించామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ముగ్గురు..
సీలేరు నుంచి మూడు వాహనాల్లో తరలిస్తున్న 1,240 కిలోల గంజాయిని రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ట్రావెల్స్ వ్యాపారం నిర్వహించే షేక్ యాసీన్ అలియాస్ ఫిరోజ్ (నాచారం) వ్యాపారంలో నష్టాలు రావడంతో గంజాయి దందాలోకి దిగాడు. తన దగ్గర తాత్కాలిక డ్రైవర్లుగా పనిచేసే తన్నీరు సంతోష్, చుంచు రవీందర్, మంద మధును తీసుకుని మూడు వాహనాల్లో విశాఖపట్నం జిల్లా సీలేరు వెళ్లి గంజాయి తెచ్చేవాడు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున చెల్లించేవాడు. బోడుప్పల్‌లోని ఆటో గ్యారేజ్‌లో సరకును నిల్వ చేసి.. ఎవరైనా అడిగితే ప్యాకింగ్ చేసి వాహనాల్లో పంపించేవాడు. సీలేరులో కిలో రూ.8వేలకు కొనుగోలు చేసి రూ.15 వేలకు విక్రయించేవాడు. ఒక్కో ట్రిప్‌నకు గ్యారేజ్ యజమాని సుగురు వాసుదేవారెడ్డి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకునేవాడు. ఈ నెల 10న ఫిరోజ్‌తో పాటు ముగ్గురు డ్రైవర్లు సీలేరుకు వెళ్లారు. 500 ప్యాకెట్లలో 1,050 కిలోలు, 190 కిలోల విడి గంజాయి కొని, 13న రాత్రికి గ్యారేజ్‌కు చేరుకున్నారు. వినియోగదారులకు చేరవేసేందుకు 573 ప్యాకెట్లను 3 వాహనాల్లో లోడ్ చేశారు. విశ్వసనీయవర్గాల సమాచారంతో సోమవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పట్టుకున్నారు. సంతోష్, వాసుదేవారెడ్డిలో పాటు సరకుకు కాపలాదారుగా వ్యవహరిస్తున్న పొన్నం రాజేశ్వర్‌లను అరెస్ట్ చేశారు. ఫిరోజ్, రవీందర్, మధు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.
అమెజాన్ విక్రయాల ముసుగులో..
అమెజాన్ కార్యకలాపాల ముసుగులో వైజాగ్ నుంచి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టును మధ్యప్రదేశ్ పోలీసులు రట్టుచేశారు. గత శనివారం భిండ్-గ్వాలియర్ రోడ్డుపై సోదాలు నిర్వహించిన పోలీసులు.. 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కల్లు వవైయా, బ్రిజేంద్ర తోమర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు భిండ్ జిల్లా ఎస్పీ మనోజ్‌కుమార్ సింగ్ తెలిపారు. అమెజాన్ విక్రయాల ద్వారా విశాఖపట్నం నుంచి నాలుగు నెలల వ్యవధిలో వెయ్యి కిలోల గంజాయి అక్రమ రవాణా జరిగినట్లు తాము గుర్తించామని ఆయన తెలిపారు. బాబు టెక్స్ కంపెనీ పేరుతో గుజరాత్‌లోని సూరత్‌లో రిజిస్టర్ అయిన ఓ వస్త్ర సంస్థ.. హెర్బల్ ఉత్పత్తుల ముసుగులో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తేలిందని చెప్పారు.
అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నాం: అమెజాన్
తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాల ముసుగులో కొందరు గంజాయిని అక్రమంగా రవాణా చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ‘‘విషయం మా దృష్టికి వచ్చింది. దానిపై దర్యాప్తు జరుపుతున్నాం. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు జరిపే దర్యాప్తునకూ మా తరఫున పూర్తిగా సహకరిస్తాం’’ అని కంపెనీ అధికార ప్రతినిధి సోమవారం తెలిపారు.
సంబంధిత కథనాలు: