జీవీఎంసీ, ఎలమంచిలి, నర్సీపట్నం మున్సిపాల్టీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పత్రం చెల్లుబాటు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. వీటికి సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో తెలిసీతెలియక తప్పు చేసినా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించి... ఆ తరువాత మిగిలిన పెట్టెల్లోని ఓట్లు లెక్కించాలని కలెక్టర్ వినయ్‌చంద్ సూచించారు. రౌండ్ల వారీ లెక్కింపులో పొరపాట్లు రాకుండా చూసుకోవాలన్నారు.
లెక్కింపు ఏజెంట్లను నియమించే క్రమంలో వారికి ముందుగా నిబంధనల గూర్చి తెలియజేయాలని అదనపు ఎన్నికల అధికారి, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి అన్నారు. అనంతరం జిల్లా పరిషత్తు సీఈవో నాగార్జున సాగర్ ఓట్ల లెక్కింపు విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ మౌర్య, సంయుక్త కలెక్టర్ గోవిందరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం: ఎస్ఈసీ