గంజాయి అమ్మకంతోనే మావోయిస్టు పార్టీకి నిధులు వస్తున్నాయని విశాఖపట్నం పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్ ఆరోపించారు. మావో సిద్ధాంతం చెప్పుకుని పోరాటం చేస్తున్న వారందరూ గంజాయ్ పండించుకుంటూ రూ.లక్షలు సంపాదిస్తున్నారని విమర్శించారు. మావోయిస్టు సిద్ధాంతాలు మంటలో కలిసిపోయాయని అన్నారు.
జులై 1న ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు బంద్‌కు పిలుపునివ్వడం మతిలేని చర్య అని అన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో వందల మంది గిరిజనుల్ని అతికిరాతకంగా చంపారన్నారు. ఎవరైనా సహకరించకపోతే గ్రామాల నుంచి వెళ్ళగొట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం మావోలు చేస్తుంటారని.. ఇవన్నీ సిద్ధాంతం అంటారా అని ప్రశ్నించారు. మావోయిస్టుల్ని గిరిజనులు తరిమికొట్టేరోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ఇప్పటికైనా జనజీవన స్రవంతిలో కలవాలని మావోలను డీఎస్పీ కోరారు.
అప్రమత్తమైన పోలీసులు
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు జులై 1న బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనిని ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మద్దిగరువు నర్మద ప్రాంతాల్లో అడుగడుగునా పోలీసుల తనిఖీలు చేస్తున్నారు.
గిరిజనులు.. ఎవరికీ ఆశ్రయం కల్పించవద్దని, వారి వద్దకు ఎవరూ వెళ్లవద్దంటూ ఇటీవల ప్రకటించారు. ఓ పక్క మావోయిస్టు బంద్‌కు పిలుపునివ్వడం.. మరో పక్క పోలీసులు గస్తీ ముమ్మరం చేయడంతో ప్రజలు భయాందోళనలతో ఉన్నారు.
16న విశాఖ తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల చనిపోయారు. వారికి నివాళులర్పిస్తూ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: రేపు బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. మన్యంలో ముమ్మర తనిఖీలు