పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి విశాఖ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈనెల 25వ తేదీ నుంచి జనవరి 7 వరకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించనుంది. జిల్లాలో సుమారు 73 వేల మందికి పైగా లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి, పాడేరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో గల 39 మండలాల్లోని అధికారులు యుద్ధ ప్రాతిపదికన నివేదికలు తయారు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా నియోజకవర్గానికి ఓ అధికారిని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నియమించి.. సూచనలు ఇస్తున్నారు. కోర్టు అభ్యంతరాలు, ఇతర తగాదాల్లో ఉన్న స్థలాలను మినహాయించి మిగిలిన వాటిని పంపిణీ చేయనున్నారు.
వివాదాల్లో లే అవుట్లు...
నక్కపల్లి మండలం న్యాయం పూడి గ్రామస్తులకు జాతీయ రహదారిని ఆనుకుని పర్యటక శాఖకు కేటాయించిన భూమిలో లే అవుట్లు తయారు చేయగా... ఆ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తహసీల్దారు రమణ ఆ స్థలాన్ని విడిచి గ్రామానికి సమీపంలో లే అవుట్ వేయించారు. ఇదే మండలంలోని బుచ్చిరాజు పేట, చందనాడ, నర్సాపురం గ్రామాల్లో గతంలో గుర్తించిన స్థలాలు ఏపీఐఐసీకి చెందినవి కావడంతో.. ప్రత్యామ్నాయం చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కొత్తగా భూమిని సేకరించి లే అవుట్లను వేశారు. ఇప్పటికే సిద్ధమైన లబ్ధిదారుల వివరాలతో కూడిన పట్టాలు మండలాలకు చేరగా.... వీటిని గ్రామాల వారీగా విభజించే పనిలో రెవెన్యూ ఉద్యోగులు నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి:
తహసీల్దార్ వినూత్న ఆలోచన... ప్రమాణ పత్రంతో లంచాలకు అడ్డుకట్ట