విశాఖ జిల్లాలో ఎరువుల కొరత లేదని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులోని రైతు భరోసా కేంద్రం, సచివాలయాన్ని ఆయన పరిశీలించారు. చాలామంది రైతులు అధిక యూరియాను ఉపయోగిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే రైతులు ఎరువులు వాడాలని సూచించారు. జిల్లాలో 30 వేల టన్నుల యూరియా అవసరముందన్న ఆయన... దీనికి అనుగుణంగా ఎరువులు సిద్ధం చేశామని వివరించారు.
రైతులు డబ్బులు చెల్లించిన రెండు రోజుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేస్తున్నామని సంయుక్త పాలనాధికారి స్పష్టం చేశారు. అధిక ధరలకు ఎరువులు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిట్టుబాటు కాని వ్యవసాయ ఉత్పత్తులను రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు.