పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న ఇద్దరి జీవితాలు విద్యుదాఘాతంతో తెల్లారిపోయాయి. విశాఖ నగర పరిధి జీవీఎంసీ 98వ వార్డులో ఆదివారం సాయంత్రం షాక్ సర్క్యూట్ జరిగింది. ఇటీవల పాత అడివివరం ప్రధాన రహదారిలో జియో ఫైబర్ నెట్‌వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి గోతులు తీయడానికి పెందుర్తి సమీప పులగవానిపాలెం ఉప్పరకాలనీకి చెందిన నక్క దేముడు, నగరంలోని కైలాసపురం ప్రాంతానికి చెందిన చల్లా నరసింగరాజు వచ్చారు.
ఆ ప్రాంత సచివాలయం ఎదురుగా పనులు జరుగుతుండగా దేముడు పని ఒత్తిడితో అలసి అక్కడే ఉన్న విద్యుత్తు స్తంభం వద్ద కూర్చుని సేదతీరాడు. తిరిగి పైకి లేచే క్రమంలో ఆ స్తంభానికి ఉన్న జంపర్ స్విచ్‌ను ఊతగా పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. రక్షించేందుకు నరసింగరాజు ప్రయత్నించి అతడు కూడా విద్యుత్తు షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరినీ స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు, విద్యుత్తు శాఖ ఏఈ సురేశ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: