విశాఖ ఎంజీఎం సెల్వి వరల్డ్ వేదికగా వాసవి క్లబ్ సంస్థ ఒక మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒకే పోలికతో ఉండే కవలల కోసం ఉత్సవం ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్న కవలలు ఒక చోట చేరారు. చిన్న పిల్లలతో పాటు.. ఎనభై ఏళ్ల బామ్మలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒకే రంగు వస్త్రాలు, ఆహార్యం, ఒకే తరహా హావభావాలతో ఈ కవలలు సందడి చేశారు. ఈ జంట కవలల కార్య క్రమంలో పాల్గొనడానికి నెలల పాటు ఎదురు చూసినవారు ఈ క్షణాలను అత్యంత అపురూపంగా ఆస్వాదించారు.
సోషల్ మీడియాలో ప్రచారం
వాసవి క్లబ్ సభ్యులు ప్రతి ఏటా ఏదో ఒక వినూత్న కార్యక్రమం చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ జంట కవలల వేడుకను నిర్వహించారు. 3 నెలలు ముందే సొషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. మనుషుల మధ్య తగ్గిపోతున్న అనురాగాలు, అనుబంధాలను, పెంపొందించడానికి ఇలాంటి వేడుకలు సోపానాలుగా నిలుస్తున్నాయి.