విశాఖలో పాత డెయిరీ ఫాం వద్ద గ్యాస్ కట్టర్ ఉపయోగించి దుండగులు ఏటిఎంను బద్దలు కొట్టి నగదు దొంగిలించడం సంచలనం రేపింది. ఎస్బీఐ ఏటిఎం షట్టర్ మూసి ఉండడం, లోపల నుంచి పొగలు రావడం గమనించిన స్ధానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏటీఎం ప్రధాన రహదారిపై ఉండటం, ఇదివరకే ఇక్కడ చోరీ జరిగినప్పటికీ సెక్యూరిటీ గార్డు అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
నిన్న సాయంత్రం కార్యాలయ వేళలు ముగిసే సమయంలో ఏటిఎంలో నగదు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దోపిడి జరిగే సమయానికి ఎంత నగదు విత్ డ్రా అయ్యింది అనే అంశాన్ని బట్టి దుండగులు ఎంత మొత్తం కాజేశారు అనే అంశం తేలనుంది.
ఏటీఎంలో ఉన్న సీసీ కెమెరాలతోపాటుగా ఆ ప్రాంతంలోని పలు సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఘటనపై అరిలోవ పోలీసులు కేసు నమోదు చేశారు. నగర నేర విభాగ డీసీపీ సురేష్ బాబు సహా క్రైమ్ ఎసీపీలు, పోలీసులు జాగిలాలు రప్పించి దర్యాప్తు చేపట్టారు. ఎంత మేరకు నగదు దోపిడికి గురైందనేది బ్యాంకు అధికారులు ఇచ్చిన లెక్కల ఆధారంగా నిర్ధారిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి...