హుద్‌హుద్ తుపాన్....విశాఖ వాసులకు ఓ పీడకల.. భీకర గాలులు, భారీ వర్షానికి ఉత్తరాంధ్ర చివురుటాకులా వణికిపోయింది. ముఖ్యంగా విశాఖ నగరానికి తీవ్ర నష్టం కలిగించింది. ముఖ్యంగా పేదలు సర్వం కోల్పోయి...నిలువ నీడలేక రోడ్డునపడ్డారు. అలాంటి వారి కోసం గత ప్రభుత్వ హయాంలో కొమ్మాది శివారు ప్రాంతంలో పక్కా ఇళ్లు నిర్మించారు. తుపాన్‌లను తట్టుకునేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఇళ్లు నిర్మించినా...అవి ఇప్పటికీ బాధితులకు అందలేదు. ఎప్పటికప్పుడు అధికారులు గడువు పెంచుతూ పోవడంతో బాధితుల్లో గుబులు రేగుతోంది. అర్హులకు అందక ముందే ఈ గృహాలు శిథిలావస్థకు చేరడం మరింత కలవరపెడుతోంది.
అధికారుల తీరుతో విసిగిపోయిన బాధితులు.. కనీస సౌకర్యాలు లేకపోయినా హుద్‌హుద్ ఇళ్లల్లోనే తలదాచుకుంటున్నారు. ఇంటి అద్దెలు చెల్లించుకోలేక అసంపూర్తిగా ఉన్నా సరే సర్దుకుపోతున్నారు. ఈ గృహసముదాయానికి విద్యుత్, నీటి సౌకర్యం కల్పించకపోవడంతో తీవ్ర అవస్థలుపడుతున్నామని బాధితులు వాపోతున్నారు. పాలకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు అధికారికంగా ఇళ్లు కేటాయించాలని హుద్‌హుద్ బాధితులు కోరుతున్నారు. తక్షణం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రశాంత్ కిషోర్ సూచనలపై స్పందించిన వైకాపా మంత్రులు, నాయకులు