పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ విశాఖలోని హౌసింగ్ బోర్డ్ కూడలి వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు ధరలను పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు జి. వామనమూర్తి అన్నారు. చమురు కంపెనీలకు ధరలను పెంచుకునే అనుమతులను రద్దు చేసి, ధరల నియంత్రణపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటు, శాసనసభ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
కరోనా నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో భాజపా ప్రభుత్వం గ్యాస్ ధరపై రూ. 100 లు పెంచడం దుర్మార్గమని సీపీఐ నగర సమితి సభ్యుడు పడాల గోవింద్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం పక్కా రోడ్ల నిర్మాణం పేరుతో చమురు ధరలపై రూ. 1200 కోట్ల సెస్ మోపి ప్రజలపై భారం వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.