విశాఖలోని ఓ పెళ్లి వేడుకలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. చోరీ చేసి చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడి ఆచూకీని గుర్తించి.. అరెస్టు చేశారు. దొంగిలించిన 53 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏం జరిగింది?
జిల్లాలోని సాయి ప్రియ రిసార్టులో పెళ్లి వేడుక జరుగుతుందని గమనించి.. గంగాధర్ అనే వ్యక్తి గోడదూకి లోపలికి ప్రవేశించాడు. సమీపంలో ఉన్న గదిలోకి వెళ్లి.. అక్కడున్న బ్యాగుల్లోని బంగారం తీసుకుని ఉడాయించాడు. అక్కడి నుంచి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్లిన దొంగ.. తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాడు.
సీసీ ఫుటేజ్ ఆధారంగా..
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిసార్టు చుట్టుపక్కల ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను గమనించిన పోలీసులకు గంగాధర్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించి, నిందితుని కదలికలపై నిఘా ఉంచారు. ఎట్టకేలకు పూర్ణా మార్కెట్ ప్రాంతంలో అతను పట్టుబడ్డాడు.
పోలీసుల వివరాల ప్రకారం...
దొంగతనం చేసిన బంగారాన్నంతా గంగాధర్ తన ఇంటిలోనే ఉంచాడు. ఒక నగను మాత్రం ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టాడు. చోరీ చేసిన 53 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలువ సుమారు 27 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. రిసార్టు లోపల సీసీ కెమెరాలు లేకపోవటం కారణంగా కేసు దర్యాప్తు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు రిసార్టులు, హోటళ్లలో పటిష్ట నిఘా వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: