పార్టీలో ఉంటూ వెన్నుపోటు రాజకీయాలు చేస్తే సహించేది లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని మళ్ల జగన్నాథం కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన అనకాపల్లి, కశింకోట మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. అటువంటి వారు ఎంత పెద్దవారైన విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
గ్రామాల వారీగా పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటామని నాగజగదీశ్వరరావు వివరించారు. జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా మేయర్ పీఠం దక్కించుకుని తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించిన సర్పంచులు, వార్డు సభ్యులను సత్కరించారు.
ఇదీ చదవండి: పుర ఓట్ల లెక్కింపు నేడే.. అభ్యర్థుల్లో ఉత్కంఠ