విశాఖపట్టణాన్ని తాకట్టు పెట్టడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. విశాఖ నగరాన్ని రాష్ట్రానికి ఫైనాన్షియల్ హబ్‌గా తయారు చేయాలని.. తెదేపా అధినేత చంద్రబాబు కృషి చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. హుద్ హుద్ తుపాను కారణంగా.. విశాఖ అంధవికారంగా తయారైందన్నారు. జిల్లా ప్రజలు వైకాపాకు ఓట్లు వేయలేదని.. గతంలో జగన్ తల్లి విజయమ్మను కూడా ఓడించారని అన్నారు. అందుకే విశాఖపై కక్ష కట్టి దారుణంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ కంకణం కట్టారని.. అందుకే నగరాన్ని తాకట్టు పెట్టడానికి నిర్ణయించుకున్నారని విమర్శించారు. జిల్లా ప్రజలకు ఇది చాలా అవమానకర విషయమని.. ఈ ప్రయత్నానికి ప్రజలే తిరగబడాలని పిలుపునిచ్చారు.
రూ.3500 కోట్ల ఆస్తులకు.. రూ.1600 కోట్ల అప్పులు అడగడం అవసరమా అని ప్రశ్నించారు. విశాఖలో అతి ముఖ్యమైన స్థలాలు, భవనాలు ఉన్నాయో వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. తమకు చేతనైన విధంగా అడ్డుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని అచ్చెన్న అన్నారు.
గాంధీ జయంతి, సహా గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి వర్ధంతి సందర్భంగా.. జిల్లాలోని తెదేపా కార్యాలయంలో వారి చిత్రపతాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు.
నగరం మీద కక్ష సాధింపు మానుకోవాలి: ఎమ్మెల్యే వెలగపూడి
విశాఖ నగరం మీద కక్ష సాధింపు మానుకోవాలని.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని ద్వారా సీఎం జగన్‌ను వేడుకుంటున్నామని.. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. విశాఖ రాజధాని పేరుతో.. నగరానికి సంబంధించిన ఆస్తులు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో 24 ఆస్తులు, 234 ఎకరాలు బదలాయింపు ప్రయత్నం చేశారని అన్నారు. ఇప్పుడు అందులో, 13 ఆస్తులు, 128 ఎకరాలు ఎస్బీఐకి, రూ.2,500 కోట్లకు విజయవాడ రిజిస్టర్ ఆఫీస్‌లో, తనఖా రిజిస్ట్రేషన్ చేశారని.. దీనిపైన టాక్స్ రాయితీ కూడా అడిగారని పేర్కొన్నారు.
ఎవరినైనా తిడితే మాట్లాడే నేతలు.. విశాఖ ఆస్తులు అమ్ముకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ చేసే ప్రతి అప్పును కూడా ప్రజల తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా తయారు చేస్తున్నారని.. జగన్ వచ్చాక ఇల్లు అమ్ముకుని పండగ చేసుకునే దుస్థితి వచ్చిందని అన్నారు.
ఇదీ చదవండి:
SAJJALA : 'కొవిడ్ ఆంక్షలు కొనసాగుతుంటే.. పవన్ సభ ఎలా పెడతారు'