అన్న క్యాంటీన్లను యథాతథంగా నడిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఇవాళ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అన్న క్యాంటీన్ లను మూసివేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కరోజులోనే మాట తప్పరన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను మూసివేయడం శోచనీయమని వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి తెలుగు దేశం పేరు మీద ఉన్న పేర్లు నచ్చకపోతే... పేర్లు మార్చి అయినాసరే అన్న క్యాంటీన్లను యథాతథంగా నడిపించాలని కోరారు. పేదలకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు ఉద్దేశించిన పథకాన్ని మూసివేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. విశాఖలోని ఎంవీపి రైతు బజార్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ వద్ద వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
నెల్లూరు జిల్లా కావలిలో అన్న క్యాంటీన్లు తెరవాలని తెదేపా ఎంపీ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. పేదవారిని ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇవీ చదవండి