పశువైద్యరాలిపై పైశాచికంతో ప్రవర్తించి పొట్టనపెట్టుకున్న నలుగురు నిందితులను వెంటనే ఉరితీయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు.
కడపలో...
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో బాలికలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల నుంచి ప్రదర్శనగా కూడలి చేరుకున్న బాలికలు మానవహారంగా ఏర్పడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రైల్వే కోడూరు పట్టణంలో కళాశాల విద్యార్థినులు ర్యాలీ చేపట్టారు. అమ్మాయిలను హత్య చేసిన మృగాళ్లకు శిక్షలు వెంటనే అమలు చేయడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో..
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో విద్యార్థులు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నిందితులను రోడ్డుపై ఉరితీస్తే తప్ప రానున్న కాలంలో ఇలాంటి ఘటనలను అదుపు చేయలేమన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పలు కళాశాలల విద్యార్థులు భారీ ప్రదర్శన ర్యాలీ చేశారు. పశు వైద్యరాలిపై పాశవికంగా దాడి చేసిన నలుగురికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు రక్షణగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ సుందర సత్సంగం మహిళలు ర్యాలీ చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా
దిశ ఘటనను నిరసిస్తూ రాజమహేంద్రవరంలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ మాన, ప్రాణాలకు రక్షణ లేకపోతే చదివించేందుకు తల్లిదండ్రులు తమను ఎలా పంపిస్తారని విద్యార్ధినులు ప్రశ్నించారు. ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం... అత్యాచార నిందితులను కఠినంగా శిక్షిద్దాం... అంటూ ముక్తకంఠంతో నినాదాలు చేశారు.
అనంతపురంలో...
అనంతపురం జిల్లా కదిరిలో దిశ నిందితులను శిక్షించాలంటూ మహిళలు రోడ్డెక్కారు. ఈ ప్రదర్శనలో కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాల పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
గుత్తి పట్టణంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మానవ మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మడకశిర పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దిశ సంఘటన పట్ల ర్యాలీ నిర్వహించారు. చీరాలలో విద్యార్థులు ఆందోళన చేశారు. గడియారస్తంభం కూడలిలో మానవహారం నిర్వహించారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విశాఖలో
ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్‌లో 'మౌనాన్ని వీడి హింసను నివారిద్దాం' అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.దిశ లాంటి ఘటనలు ఇకపై జరగకుండా అందరు కృషిచేయాలని పిలుపునిచ్చారు.