ప్రజారోగ్య శ్రేయస్సు కోసం కొవిడ్ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కొన్నాళ్లపాటు తమ పేటెంట్ హక్కులను సరళతరం చేయడం మంచిదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ కులపతి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సంస్థ నిర్వహించిన రెండు రోజుల నమూనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మిస్టీరియల్ కాన్ఫరెన్స్ శనివారం ముగిసింది. కార్యక్రమానికి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి ముఖ్య అతిథిగా హాజరై వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా అది ప్రపంచానికి చేరాలంటే పలు రకాల సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ధనిక దేశాలు ఎక్కువ ధర వెచ్చించి టీకా కొనుగోలు చేస్తున్నాయని.. పేద దేశాలు టీకా అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. తయారీ కంపెనీలు పేటెంట్ హక్కులను సరళతరం చేసినప్పుడే వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు తాత్కాలికంగా పేటెంట్ హక్కుల రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చినా ధనిక దేశాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఇప్పటికైనా కంపెనీలు ప్రజల కోసం కొంత కాలమైనా పేటెంట్ హక్కుల రద్దును అమలు చేయాలని అరూప్‌కుమార్ గోస్వామి విజ్ఞప్తిచేశారు. వీసీ ప్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. AMARAVATI: కలల రాజధాని ఇప్పుడిలా..!