నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. మాల్దీవులు-కొమరిన్ , నైరుతి బంగాళా ఖాతం, తూర్పు మధ్య బంగాళా ఖాతాల్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు సహా ఆగ్నేయ బంగాళా ఖాతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్ర వాయుగుండంగా..
ఉదయం అతి తీవ్ర తుపాను 'యాస్' తీవ్ర వాయుగుండంగా మారి బలహీనపడి దక్షిణ జార్ఖండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన వివరించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఉష్ణోగ్రతలూ అధికమే..
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని స్పష్టం చేసింది.
2 నుంచి 4 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు..
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4C అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి : జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు