విశాఖ సింహాచలం దేవస్థానానికి చెందిన సింహగిరులపై లాక్‌డౌన్ సమయంలో.. జరిగిన పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగినవేనని.. దేవాదాయ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. ఘాట్ రోడ్‌కి 250 మీటర్ల దూరంలో... భారీగా క్వారీయింగ్ జరిగినట్టు గుర్తించింది. అంజనేయస్వామి విగ్రహం దాటిన తర్వాత.. కొత్త టోల్ గేట్ నిర్మాణం పేరిట బైపాస్‌కి అనుకుని ఉన్న గుట్టను.. పూర్తిగా తొలిచేశారని తేల్చింది. గుట్ట చదును చేసేందుకు గణేష్ కన్స్ట్రక్షన్స్ యజమాని కె.శ్రీనివాసరావుకు దాత ప్రాతిపదికన... ఈవో అనుమతి ఇచ్చారని.. దీనికి కమిషనర్ నుంచి గాని, ఇంజినీరింగ్ విభాగం నుంచి గాని అనుమతుల్లేవని పేర్కొంది. చెత్త తొలగింపు పేరిట.. శ్రీనివాసరావు గ్రావెల్ అంతా తరలించుకుపోయినట్లు వివరించింది. వాస్తవానికి ఘాట్‌రోడ్ చదును పని మాస్టర్ ప్లాన్‌లో లేకపోయినా.. ఈవో ఏకపక్షంగా పని అప్పగించినట్ల కమిటీ గుర్తించింది. ఆలయానికి ఇద్దరు ఈఈలున్నా వారిని సంప్రదించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మైనింగ్‌కు వెనుకటి తేదీలతో.. అనుమతి ఇచ్చినట్టుగా ఈవో రికార్డులు తయారు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది.
సింహాచలం దేవాలయం వెనక భాగాన కొండపై.. 2009-10లో పర్యావరణానికి హాని కలగకుండా 24 గిరిజన కాటేజీలు నిర్మించారు. గిరిజనులు ఆ కాటేజీల్లో.. అవాసం ఉన్నందున వాటిని వేలం వేసి లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రోడ్డు వేయాలనే ఉద్దేశంతో... దేవాలయం వెనక భాగాన ఉన్న పర్యావరణాన్ని అనుమతుల్లేకుండా దెబ్బతీశారని.. నివేదికలో తెలిపారు. దీనివల్ల చిన్న వర్షానికీ కొండచరియలు విరిగి... అర్చకులు, భక్తుల ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని పేర్కొంది. అభివృద్ది పేరిట పెద్ద చెట్లనూ తొలగించారని.. కమిటీ తెలిపింది. ఏపీ ట్రాన్స్‌కో కాంట్రాక్టర్ హైటెన్షన్ విద్యుత్తు తీగలు ఏర్పాటుచేసే క్రమంలో..దాదాపు 6 లక్షల రూపాయల విలువైన గ్రావెల్ తరలించినట్లు గుర్తించింది. ఈ మొత్తాన్ని ఆ కాంట్రాక్టర్ నుంచే తిరిగి దేవస్ధానానికి రాబట్టాలని సూచించింది. కొండపైన నిర్ణీత వివరాల్లేకుండానే కొన్ని ప్రదేశాల చదునుకు.. మే 16న ఈవో నోటిఫికేషన్ ఇవ్వడం..దాత పేరిట జరిగిన పనులన్నింటికీ బిల్లులు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లుందని కమిటీ నివేదికలో పేర్కొంది. 50 శాతం జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్‌లో లేని, అత్యవసరం కాని పనులకు టెండర్లు పిలవడాన్ని... తప్పుబట్టింది. ప్రభుత్వం అన్నిదేవాలయాల్లో అభివృద్ధి పనులపై నిషేధం విధించినా... సింహాచలం ఈవో వాటిని తుంగలో తొక్కారని.. తెలిపింది. దాతగా చెప్తున్న వ్యక్తి నుంచి 15 లక్షలు, ట్రాన్స్‌కో కాంట్రాక్టర్ నుంచి 6లక్షల రూపాయిల పరిహారం వసూలు చేయాలని సూచించింది. ప్రస్తుత ఈవోను.. తప్పించి అతనిపై చర్యతీసుకోవాలని నివేదికలో కమిటీ సిఫార్సు చేసింది.
దేవస్థానం భూ ఆక్రమణలపైనా కమిటీ నివేదించింది. పలుప్రాంతాల్లో గతంలో తొలగించిన అక్రమ నిర్మాణాలు మళ్లీ వెలసినట్లు పేర్కొంది. తొలిపావంచా వద్ద అక్రమణలను.. గత ఈవో తొలగించగా... ఇప్పుటి ఈవో 12 దుకాణాలు తిరిగి నిర్మించుకునేందుకు అనుమతిచ్చినట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కమిషనర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపింది. మాస్టర్ ప్లాన్‌కి వ్యతిరేకంగా జరిగిన ఈ అక్రమ నిర్మాణాలకు బాధ్యతగా... 2017 నుంచి అక్కడే తిష్టవేసిన దేవస్థానం భూముల డిప్యూటీ కలెక్టర్ పి.శేష శైలజను వెంటనే తప్పించాలని.. సిఫారసు చేసింది. తొలి పావంచా షాపుల వద్ద నుంచి కనీసం పది వేలు వసూలు చేయాలని సూచింది.
ఇదీ చదవండి: ఆ పనులతో.. సింహాచలం చిన్నబోతోందా..?