AP Capital Shifting to Visakhapatnam: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ప్రభుత్వ కార్యాలయాలు వేటినీ అక్కడి నుంచి తరలించవద్దని హైకోర్టు విస్పష్టంగా చెప్పినా, దానిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినా.. ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. కోర్టు తీర్పుల్ని బేఖాతరు చేసి చీకటి జీవోలతో దొడ్డిదోవన రాజధానిని విశాఖకు తరలించేందుకు సిద్ధపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అనే ముసుగేసి..కోర్టుల్నీ మభ్యపెట్టేందుకు తెగబడింది. విశాఖలో మంత్రులు, అధికారులకు తాత్కాలిక వసతి, అమరావతి నుంచి విశాఖకు రాకపోకలకయ్యే రవాణా ఖర్చుల రూపంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టబోతోంది.
విపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక కూడా రాజధానిపై వైసీపీ నాయకులు రెండు నాల్కల ధోరణే అవలంభిస్తున్నారు. విశాఖలోని రుషికొండపై కడుతోంది సీఎం క్యాంప్ ఆఫీసు కానేకాదు.. పర్యాటకశాఖ రిసార్ట్స్ మాత్రమేనని ఇన్నాళ్లూ బుకాయించారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు.
CM Jagan Shifting AP Capital to Visakhapatnam: రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా విధాన నిర్ణయం తీసుకున్నా.. పెద్ద కార్యక్రమం తలపెట్టినా.. దాని అమలు ఎంతో పారదర్శకంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరగాలి. జగన్ సర్కార్ రాజధానిని మోసపూరితంగా విశాఖకు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నంలో కుట్ర, ద్రోహం మాత్రమే కనిపిస్తున్నాయన్న అభిప్రాయం తటస్థులు, మేధావుల్లో వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని వస్తోందన్న ఉత్సాహం లేదు. ఇప్పటికే అక్కడ వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు చూశాక.. రాజధానిని అక్కడికి తరలిస్తే ఇంకెన్ని ఆఘాయిత్యాలకు తెగబడతారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి, ద్రోహం చేసి రాజధానిని తరలిస్తున్నారని అమరావతి రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు రాయలసీమ ప్రజలు.. తమ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందే కాకుండా, రాజధానినీ దూరంగా తీసుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు విశాఖలో ముఖ్యమంత్రి నివసించేందుకు 270 కోట్ల రూపాయలతో అత్యంత విలాసంగా నిర్మించిన భవనాన్ని కూడా.. రిసార్ట్ అని మభ్యపెట్టి మోసపూరితంగా నిర్మించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి చెబుతున్న ప్రభుత్వం.. నాలుగున్నరేళ్లలో అక్కడ ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేసిందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గట్టిగా వంద మందికి ఉపాధినిచ్చే ఒక్క పరిశ్రమనైనా తెచ్చిందా? కనీసం రైల్వే జోన్నైనా తేగలిగిందా?
వైసీపీ నాయకులు విశాఖపై పడి దోచుకోవడం తప్ప ఆ ప్రాంతం అభివృద్ధికి చేసిందేంటి? ఉత్తరాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలన్న విషయం ఈ ప్రభుత్వానికి.. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా గుర్తొచ్చిందా? సీఎం, అధికారులు వెళ్లి విశాఖలో కూర్చుంటే..ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిపోతుందా? రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల పరిస్థితేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కోర్టు ధిక్కరణ నేరం కిందకు రాకుండా తప్పించుకునేందుకు, విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటిలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి భారీ ఉపోద్ఘాతం రాసింది. కేవలం ఉత్తరాంధ్ర గురించే ప్రస్తావిస్తే బాగుండదనుకుందో ఏమో.. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలో ఆదోని అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశామని తెలిపింది. ఆ సంస్థ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు ఐదు మాత్రమే! కేవలం 5 నియోజకవర్గాలతో ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తే.. మొత్తం రాయలసీమ అభివృద్ధి జరిగిపోతుందా? ఎవర్ని మోసం చేయడానికి ఇదంతా? అన్ని అక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు.
కార్యదర్శులు, విభాగాధిపతులు, ప్రత్యేకాధికారులు రాబోయే రోజుల్లో పూర్తిగా ఉత్తరాంధ్రలో తిరగాలన్నట్టుగా జీవోలో వెల్లడించారు. కార్యదర్శులు బొంగరంలా తిరుగుతూ ఉంటే వారు చేయాల్సిన పనిఎవరు చేస్తారని..విశ్రాంత IAS అధికారి పీవీ రమేశ్ అన్నారు. సీఎం, మంత్రులు జిల్లాలకు వెళితే మొత్తం అన్ని శాఖల అధికార యంత్రాంగం తరలి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వారికి అక్కడ సహాయపడేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఉంటుందని.. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కేవలం ప్రజల్ని మోసగించడానికేనని స్పష్టంచేశారు.
విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని విపక్షనేత హోదాలో అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని ఎక్కడికీ మారబోదని అందుకే 'గుంటూరూ.. విజయవాడ' అని పిలుస్తున్నానని దీర్ఘాలు తీశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తుందంటూ తెదేపా దుష్ప్రచారం చేస్తున్నారని.. రాజధాని ఎక్కడికీ మారదనడానికి జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకోవడమే నిదర్శనమని ఎన్నికల ముందు వైసీపీ నాయకులు ఊదరగొట్టారు. మరి ఇప్పుడు చేస్తోందేంటి? కోర్టులు వద్దని చెప్పినా.. చీకటి జీవోలతో విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రయత్నించడాన్ని ఏమనాలని ప్రతిపక్షనేతలు నిలదీస్తున్నారు.
CM Jagan Administration from Visakha: దసరా నాటికి విశాఖ నుంచి సీఎం జగన్ పాలన.. జోరుగా ప్రచారం