విశాఖలో కొవిడ్ టీకా పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. సిబ్బంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజుకు 50 నుంచి 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. విశాఖలోని మొత్తం 32 కేంద్రాల్లో.. ముందుగా నమోదు చేసుకున్న ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి.. ఈ నెల 25 వరకు టీకా వేసేలా చర్యలు చేపట్టారు.
తర్వాత దశలో ఉద్యోగులు, ఇతర అనుబంధ రంగాల వారికి.. వ్యాక్సిన్ అందించడానికి రంగం సిద్ధం చేసినట్లు చినవాల్తేర్ టీకా పంపిణీ కేంద్ర నిర్వహణ ప్రతినిధి మాధురి తెలిపారు. చరవాణిలో సందేశం వచ్చిన వారికే టీకా ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వ్యాక్సిన్ స్వీకరించనున్న వ్యక్తి ఆరోగ్య వివరాలు తెలుసుకుని.. టీకా వేసిన అనంతరం 30 నిమిషాలు పర్యవేక్షణలో ఉంచిన తరవాతే ఇంటికి పంపుతున్నామన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని కేజీహెచ్ సీఎంవో డాక్టర్ సాధన వెల్లడించారు. కరోనా నుంచి రక్షించేది టీకా మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: