Shilpa Surana: కళారూపాల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న.. విశాఖ వాసి శిల్పా సురానా గురించి ప్రత్యేక కథనం.
శిల్ప వాళ్లది రాజస్థాన్‌లోని రతన్‌గడ్‌కు చెందిన వ్యాపార కుటుంబం. బీకాం చేశారు. 24 ఏళ్లపుడు దూరపు బంధువైన రాజేశ్‌ను పెళ్లి చేసుకుని విశాఖపట్నం వచ్చారు. వీళ్లకి ముగ్గురు పిల్లలు. 35 ఏళ్ల వరకూ వారి ఆలనాపాలనా చూడటంలోనే గడిచిపోయింది. పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలయ్యాక చాలా సమయం మిగిలేది. ఏం చేయాలా అని ఆలోచించినపుడు.. తనకు బొమ్మలు వేసే నైపుణ్యం ఉందన్న విషయం గుర్తొచ్చింది. కళలపైన తన ఆసక్తిని భర్తకు చెబితే, ఆయనా ప్రోత్సహించారు.
ఆంధ్రా యూనివర్సిటీలో మూడేళ్ల బి.ఎఫ్.ఎ(బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్), ఆపైన మాస్టర్స్ కూడా పూర్తిచేసి వాటర్ పెయింటింగ్స్, పెన్సిల్ స్కెచెస్, పోస్టర్ పెయింట్స్, ఆక్రిలిక్ పెయింట్స్, ఆయిల్ పెయింట్స్, మ్యూరల్స్, రిలీఫ్ వర్క్స్, బ్రాంజ్ క్యాస్టింగ్, టెర్రకోట, పేపర్ పల్ప్ వర్క్స్, 3డీ స్కల్‌ప్చర్స్ చేయగలగే సామర్థ్యం సంపాదించారు. ‘తర్వాత ఏంటి?’ అన్న ప్రశ్న ఎదురైనపుడు... తనే కళారూపాలను తయారు చేయాలనుకున్నారు. కానీ దానికి చాలా ఖర్చవుతుంది. ప్రత్యేకంగా చోటూ కావాలి. నేనున్నానంటూ భర్త అండగా నిలిచారు. తన కళాకృతులను ప్రదర్శించేందుకు ఆయన నడిపే టైల్స్ దుకాణంలో కొంత స్థలాన్ని కేటాయించారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు శిల్ప. తన మనసులో మెదిలే ఆలోచనల్నే కళ్ల ముందు ఆవిష్కరిస్తూ వివిధ రకాల కళాకృతులను చేయడం మొదలుపెట్టారు. వీటన్నింటిలోకి ఆమెకు అత్యంత ఇష్టమైనదీ, పేరుతెచ్చిందీ ఫైబర్ గ్లాస్ ఉపయోగించి చేసే 3డీ స్కల్‌ప్చర్స్.
మట్టితో రూపొందించి.. ఫైబర్‌గ్లాస్ 3డీ విగ్రహం తయారీకి ముందుగా మట్టితో ఆ బొమ్మని తయారుచేసుకుంటారు. తర్వాత దానిపై ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పోతపోసి మౌల్డ్ తీసుకుంటారు. ఆ మౌల్డ్ సాయంతో ఫైబర్‌గ్లాస్‌ను పొరలు పొరలుగా వేస్తూ విగ్రహాన్ని తయారుచేస్తారు. దానికి సరైన నునుపుదనం తీసుకురావడానికి రోజుల తరబడి పాలిష్ చేస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి 2 - 4 నాలుగు వారాలు పడుతుంది. అవి నున్నగా మెరవడం కోసం చేసే పాలిషింగ్ అత్యంత ముఖ్యమైన పని. శిల్ప చేసిన విగ్రహాలు వినియోగదారులను ఆకర్షించాయి. దీంతో స్వల్ప వ్యవధిలోనే డిమాండ్ పెరిగిపోయింది. 2 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ విగ్రహాలను తయారు చేస్తుంటారీమె! వీటిలో ఎక్కువగా జైన మత తీర్థంకరుడు వర్థమాన మహావీరుడివే ఉంటాయి. విశాఖ నగరంలోని వాల్తేర్ క్లబ్, బీచ్ రోడ్, కన్వెన్షన్ సెంటర్‌లలో శిల్ప కళారూపాలు కొలువుదీరాయి. ఈమె గురువు రవిశంకర్ పట్నాయక్ (విశాఖ బీచ్‌రోడ్ సుందరీకరణ పనులు చేసిన వ్యక్తి) ఇటీవలే కన్నుమూశారు. ఆయనకి నివాళిగా 18 అడుగుల విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.
విరామం లేకుండా.. ఇప్పటివరకూ దిల్లీ, ముంబయి, పాండిచ్చేరి, దుబాయిలలో తన కళాకృతులను ప్రదర్శించారు శిల్ప. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ, విశాఖ హవామహల్, ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లలోనూ పాల్గొని ఎందరో ప్రముఖుల మన్ననలు అందుకున్నారు. ముంబయి, నాగ్‌పుర్, దిల్లీ, సూరత్‌ల నుంచీ తనకు ఆర్డర్లు వస్తుంటాయి. విగ్రహం ఖరీదు సైజునుబట్టి లక్ష నుంచి ఇరవై లక్షల రూపాయల వరకూ ఉంటుంది. తనకు వచ్చిన లాభాలతో సొంత ఆర్ట్ గ్యాలరీని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చేస్తున్న తెలుపు రంగు విగ్రహాలతోపాటు త్వరలో బంగారం పోతవీ చేయబోతున్నారు. కళా రంగంలో తన కలల్ని నిజం చేసుకుంటున్న శిల్ప.. అనుకున్న రూపు వచ్చేవరకూ మరో ఆలోచనేదీ రాదనీ, ఒక్కోసారి రెండేసి రోజులపాటు విశ్రాంతే లేకుండా పనిచేస్తూ ఉండిపోతాననీ చెబుతారు.
ఎంత పని ఉన్నా ఇల్లాలిగా, తల్లిగా కుటుంబానికే నా మొదటి ప్రాధాన్యం. పొద్దున్నే లేచి ఎనిమిదింటికల్లా పిల్లల్ని స్కూల్‌కి పంపించి వర్క్‌షాప్‌కి వెళ్తాను. ఆర్ట్‌ఫెయిర్లకు వెళ్లేటపుడు బొమ్మల్ని ప్యాక్ చేయడం, రవాణా, అన్‌ప్యాకింగ్... కష్టంతో కూడిన పని. అలాగని వెళ్లకపోతే మన వర్క్ గురించి ఎవరికీ తెలీదు. సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ, టైమ్ అనుకూలించేవరకూ సంకల్పం సడలిపోకుండా ఓపికతో ఉండాలి. అప్పుడు విజయం తప్పక వరిస్తుంది.
ఇదీ చదవండి: