మారుమూల ప్రాంతాలను విద్యాశాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ పాఠశాలే నిదర్శనం. సోలార్ విద్యుత్ నిర్వహణ గదిలోనే తరగతులు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విశాఖ మన్య కేంద్రం అత్యంత మారుమూల అనంతగిరి మండలం తోంకోట ప్రాథమిక పాఠశాల సోలార్ విద్యుత్ నిర్వహణ గదిలో తరగతులు జరుగుతున్నాయి. గ్రామంలో పాఠశాల లేకపోవటంతో, భవన నిర్మాణానికి అప్పటి నేతలు సంకల్పించారు. ఆ తర్వాత గోడల స్థాయి వరకూ నిర్మించి వదిలేశారు.
గ్రామమంతా పూరిగుడిసెలు ఉండటంతో చేసేది లేక అందుబాటులో ఉన్న సోలార్ విద్యుత్ నిర్వహణ గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామానికి సరిపడా విద్యుత్ ఇక్కడ నుంచే సరఫరా అవుతోంది. విద్యార్థులు కూర్చునే గదిలో చుట్టూ బ్యాటరీలు వైర్లు కలిగి ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షం కురిసినప్పుడు గది అంతా చెమ్మగా మారి ప్రమాదకరంగా ఉన్నా గదిలోనే పాఠాలు బోధిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, పాఠశాలను పూర్తి స్థాయిలో నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఒనకడిల్లిలో జన సంపర్క శిబిరం ఏర్పాటు