Rushikonda Constructions: విశాఖ తీరంలోని రుషికొండ ప్రాజెక్టువద్ద సుప్రీంకోర్టు వద్దన్నచోటా పనులు ముమ్మరంగా జరుగుతున్న తీరు చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ రేయింబవళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మొదటి అంతస్తు సెంట్రింగ్ వరకు వచ్చాయి. పని ప్రదేశంలో సిబ్బంది ఎక్కువగానే కనిపిస్తున్నారు. రుషికొండ వద్ద కొత్తగా తవ్వినచోట ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని జూన్ 1న సుప్రీంకోర్టు ఆదేశించింది. పాత రిసార్టు ఉన్నచోట ఉత్తరంవైపు నిర్మించుకోవాలని పేర్కొంది. పాత భవనాలున్న చోట పనులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అందుకు విరుద్ధంగా గీతం విశ్వవిద్యాలయానికి ఎదురుగా పనులు చేపట్టడం గమనార్హం.
వ్యర్థాల కుమ్మరింత అవాస్తవం: హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడానికి ముందే.. రుషికొండ సమీపంలోని బస్ షెల్టర్‌ను తొలగించామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి బస్ షెల్టర్ కూల్చివేశామని పిటిషనర్లు చెబుతున్న ఆరోపణల్లో వాస్తవం లేదంది. రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా వచ్చిన వ్యర్థాలను బంగాళాఖాతంలో కుమ్మరిస్తున్నామన్న వాదనలోనూ వాస్తవం లేదని పేర్కొంది. తాత్కాలికంగా మట్టి వ్యర్థాలను వేసేందుకు అరు ప్రాంతాలను గుర్తించామని తెలిపింది. మట్టి కుమ్మరిస్తున్న చింతలుప్పాడ బంగాళాఖాతం పరిధిలోకి రాదని తెలిపింది. పర్యాటకశాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పర్యాటకశాఖ ఎండీ కె.కన్నబాబు ఈ మేరకు హైకోర్టులో అదనపు అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇటీవల హైకోర్టు ధర్మాసనం.. వ్యర్థాలను సముద్రంలో కుమ్మరించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: సీపీఎస్ రద్దు హామీ కొండెక్కినట్లేనా?.. వాటా పేరుతో సర్కార్ కొత్త అప్పు!