ప్రపంచవ్యాప్తంగా వంద నగరాల్లో 2050వ సంవత్సరానికి తీవ్రమైన నీటికొరత తలెత్తే ముప్పు పొంచి ఉందని డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ (వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) అధ్యయనంలో వెల్లడైందని.... ఆ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ నగరం ఉండడం ఆందోళనకర అంశమని విశ్రాంత ఐ.ఎ.ఎస్. అధికారి ఇ.ఎ.ఎస్.శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమేరకు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ఎం.ఎ.యు.డి.(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్‌డవలప్‌మెంట్) కార్యదర్శికి లేఖ రాశారు. విశాఖలో నీటి కొరతకు దారితీసిన పరిస్థితులను, లేఖలోని వివరాలను ఆయన ‘ఈనాడు- ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
విశాఖలో ఐదు రిజర్వాయర్లు ఉండగా వాటి పరీవాహక ప్రాంతాలు ఆక్రమణలకు గురికావడం, నిర్మాణ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతుండడంతో రిజర్వాయర్లకు చేరే నీటి పరిమాణం క్రమంగా తగ్గిపోతోంది. ఫలితంగా విశాఖలో ఉన్న ప్రస్తుత రిజర్వాయర్ల సామర్థ్యం 60శాతం తగ్గింది.
* విశాఖ నగర జనాభా పెరగడంతో భూగర్భ జలాల వినియోగం కూడా గణనీయంగా పెరిగి నగరంలో వేసవి వచ్చిందంటే నెలలపాటు బోర్లు ఎండిపోయి నీటికి నానా అవస్థలు పడుతున్నారు.
* భూగర్భజలాల్ని భారీఎత్తున వినియోగిస్తున్నా ఆమేరకు భూమిలోకి ఇంకించే కార్యక్రమాలు ఏమాత్రం చేపట్టడంలేదు. ఫలితంగా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి.
* విశాఖ నగరానికి అనుకునే సముద్రం ఉండడంతో నగర భూగర్భంలోకి సముద్ర జలాలు భూమి పొరల గుండా క్రమంగా చొచ్చుకువస్తున్నాయి. ఫలితంగా మంచినీరు కాస్తా ఉప్పునీరుగా మారిపోతోంది.
* విశాఖ నగరంలో సుమారు 150 వరకు సహజసిద్ధమైన చిన్నా,పెద్దా చెరువులు, ఇతర నీటివనరులు ఉండేవి. అందులో చాలా వరకు ఆక్రమణలకు గురికావడం, ఇతర అవసరాలకు వినియోగించడంతో విశాఖలో తీవ్రమైన నీటికొరత తలెత్తడానికి అవకాశాలు తలెత్తాయి.
* నగరంలోని రిజర్వాయర్లలోకి సహజసిద్ధంగా వచ్చే నీరు కూడా వివిధ ప్రాంతాల్లోని వ్యర్థ, మురుగునీటితో కలిసిపోయి వస్తోంది. ఫలితంగా రిజర్వాయర్లలోకి వచ్చే నీటి నాణ్యత కూడా దెబ్బతింటోంది.
ఇదీ చదవండి: అక్రమార్కులపై చర్యలు తప్పవు: జిల్లా రిజిస్ట్రార్ మన్మధరావు