విశాఖ జిల్లా ఎక్సైజ్ శాఖకు వాహనాలను అద్దెకు ఇచ్చిన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 16నెలలుగా అధికారులు అద్దె చెల్లించకపోవడంతో వాహనాలను నిలిపివేయాలని యజమానులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అద్దె వాహనాల సంఘం ప్రతినిధులు నోటీసులు అందజేశారు. దీంతో విధులకు ఎలా హాజరు కావాలి అనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విధి నిర్వహణ కోసం 34బొలెరో వాహనాలు అద్దె ప్రాతిపదికన వినియోగించుకునేందుకు గత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందుకోసం టెండర్లు పిలిచింది. ఒక్కో వాహనానికి నెలకు రూ.35 వేలు చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. దీంతో ప్రైవేటు వాహనాల యజమానులు పలువురు తమ వాహనాలను ఎక్సైజ్ శాఖకు అద్దెకు ఇచ్చారు.
బిల్లులు అందడం లేదు..
గత ప్రభుత్వం బిల్లులు సక్రమంగా చెల్లించినప్పటికీ వైకాపా అధికారం చేపట్టిన తరువాత పరిస్థితి మారిందని తెలుస్తోంది. వాహనాల కోసం ఎక్సైజ్ శాఖ బడ్జెట్లో, నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దాంతో అద్దె చెల్లింపులు ఆగిపోయాయి. దీనిపై పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలించలేదని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా లేఖలు రాశామని అయినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. అందుకే వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు విశాఖ జిల్లా డ్రైవర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు.
గత్యంతరం లేదు..
బ్యాంకు రుణం ప్రాతిపదికన వాహనాలను తీసుకున్నామని యజమానులు తెలిపారు. వాయిదాలు సకాలంలో కట్టకపోతే సీజ్ చేస్తామని ఫైనాన్స్ సంస్థలు హెచ్చరిస్తున్నాయని వివరించారు. ఇంట్లో బంగారం, ఇతర విలువైన వస్తువులను తాకట్టు పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామని, గత్యంతరంలేక వాహనాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు సంఘం ప్రతినిధులు రమేష్ , సత్తిబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వాల్తేరు క్లబ్ ఫిర్యాదులపై 'సిట్' విచారణ