బిల్డ్ ఏపీ పేరుతో విశాఖ మహానగరంలో ప్రభుత్వ ఆస్తుల తనఖా వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఆస్తులను తనఖా పెడుతూ రుణం కోసం ఆర్థిక శాఖ చర్యలు కొనసాగిస్తోంది.
స్థిరాస్తి వివరాలను సేకరించారు..
ఈ అంశంలో జిల్లాకు సంబంధించిన మొత్తం వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. జిల్లాల పునర్విభజన సందర్భంగా విలువైన స్థిరాస్తి వివరాలన్నింటినీ సేకరించారు. మరోవైపు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కార్యాలయాలు, తాత్కాలిక భవనాలు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశంపైనా భూ స్థలాల వివరాలను సేకరిస్తోంది.
కొద్ది రోజుల పాటే హామీగా..
ప్రభుత్వం బ్యాంకు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలకు వెళ్లేటప్పుడు బంగారం, స్థిరాస్తి ఏది ఉంటే అది హామీగా చూపిస్తుందని అధికార వర్గాల అంచనా. కొద్ది రోజులు పాటు మాత్రమే హామీ రూపంలో ఉంటాయిని.. అనంతరం రుణం చెల్లించగానే రుణ విముక్తి అవుతాయని.. ఫలితంగా తనఖా నుంచి విడుదల అవుతాయని ఆర్థిక వర్గాలు పేర్కొన్నాయి.
విశాఖ భూములు రూ.వేల కోట్లపైనే
విశాఖ నగరంలో భూములన్నీ దాదాపుగా అత్యంత విలువైనవే. వీటి విలువ బహిరంగ మార్కెట్లో వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. విశాఖ కలెక్టర్ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల ప్రాంగణం, డైరీ ఫాం భూములు సహా ప్రభుత్వ అధీనంలో ఉన్న విలువైన భూములను హామీగా చూపి ఆర్థికంగా వెసులుబాటు తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అంత అవసరం ఏమిటో ??
దీనికి ప్రభుత్వం వద్ద నిధుల సమీకరణ ఓ మార్గంగా చెబుతున్నా.. ఇది తాత్కాలిక ఏర్పాటు కోసం మాత్రమేనని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టాల్సిన ఆవశ్యకత ఏమిటన్నది ప్రస్తుతం అందరి మెదళ్లలో ఎదురవుతున్న ప్రశ్న.
ఇవీ చూడండి : curfew extended: కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. ఆ సమయంలో బయటికొస్తే చర్యలు!