వచ్చే నెల నుంచి అమ్మఒడి సాయం అందించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం..ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ వరకు విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని చెప్పింది. దీని కోసం ప్రతి పాఠశాలకు విద్యాశాఖ ఒక కోడ్‌ను కేటాయించింది. చైల్డ్ ఇన్ఫోలో ఉన్న విద్యార్థుల వివరాలను పాఠశాల యాజమాన్యం కోడ్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాలకు కేటాయించిన యూ-డైస్ ద్వారా సిబ్బంది మాత్రమే వివరాలు నమోదు చేసే వీలుంది. సంబంధిత మండల విద్యాశాఖ వద్ద మాత్రమే యూ-డైస్ కోడ్ వివరాలుంటాయి.
వివరాలు నమోదు చేసుకోవాలి..
పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లి ఖాతాలో అమ్మఒడి సాయం కింద రూ.15 వేలు ప్రభుత్వం జమ చేస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల వివరాలు తల్లి లేదా సంరక్షకుల వివరాలు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని చెప్పారు. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు పంపించామన్నారు. తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్సీఐడీ కోడ్, రేషన్ కార్డు, ఆధార్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఈనెల 15వ తేదీ లోగా అప్లోడ్ చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ప్రతి డివిజన్‌కు నోడల్ అధికారిని నియమించామని డీఈవో తెలిపారు.
ప్రైవేటు పాఠశాలల మెలిక..
ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు యాజమాన్యం నమోదు చేయడం సాధ్యం కాదు. దీంతో ఫీజులు చెల్లించకపోతే చైల్డ్ ఇన్ఫోలో డేటా అప్లోడ్ చేయబోమని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అమ్మఒడి సహాయం పొందడానికి ప్రైవేటు పాఠశాలలు ఫీజుల మెలిక పెట్టడం సరైంది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై విశాఖ జిల్లాలో ఇప్పటికే అధికారులను కలిసి వినతి పత్రాలను అందజేశారు.
తరగతులు విననివ్వట్లేదు..
కొవిడ్ వల్ల ఈ విద్యాసంవత్సరం తొలి నాలుగు నెలలు పాఠశాలల్లో తరగతులు నిర్వహించ లేదు. ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించని విద్యార్థులకు తరగతులు వినే అవకాశం ఇవ్వటం లేదు.
తల్లిదండ్రుల ఆందోళన..
కరోనా కారణంగా ఈ ఏడాది విద్యార్థుల నుంచి కేవలం ట్యూషన్ ఫీజు 70 శాతం మాత్రమే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అమ్మఒడి సాయం కోసం పిల్లల వివరాలు పంపించాలంటే ఫీజులు చెల్లించాల్సిందే అని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వివరాల నమోదుకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి..
కరోనా ప్రభావంతో చిన్నా.. చితకా ప్రైవేటు పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో అక్కడ చదివే విద్యార్థులు సమీపంలోని మరో ప్రైవేటు లేదా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ఇటువంటి విద్యార్థుల వివరాలు ప్రస్తుత బడులకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని చోట్ల పాఠశాలల మూసివేత తరువాత సంబంధిత యాజమాన్యాలు పత్తా లేకుండా పోయాయి. ఇది కూడా అమ్మబడి సాయం పొందటానికి విద్యార్థులకు అవరోధంగా మారింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు.. విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప అమ్మబడి సాయం పొందే అవకాశం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: