President Fleet Review:తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం విశాఖపట్నంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కోసం సర్వం సిద్ధమైంది. దాదాపు ఏడాదిగా ఇందుకోసం ఏర్పాట్లు చేసుకుంటూ నౌకాదళం విస్తృత ప్రణాళిక అమలు చేసింది. సర్వ సైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి తన పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈసారి ఈ రివ్యూ చేయనున్నారు. మిలన్-2022 పేరుతో జరిగే నౌకాదళ విన్యాసాల్లో మొత్తం 44 యుద్ధనౌకలు, కోస్ట్ గార్డ్ నౌకలు జాతీయ ఓషణోగ్రఫీకి చెందిన నౌకలు పాల్గొంటున్నాయి. జలాంతర్గాములు, అత్యాధునిక నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భాగం పంచుకుంటున్నాయి.
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి...
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీసమేతంగా ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకోగా... గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్, ఇతర మంత్రులు, అధికార యంత్రాంగం ఘనస్వాగతం పలికింది. ఈ ఉదయం 9 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం నుంచి దేశ సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐఎన్ఎస్ సుమిత్ర నౌకలో ఫ్లీట్ రివ్యూ కోసం బయలుదేరుతారు. ఆయన ప్రయాణించే నౌకకు ముందు వెనుక పైలెట్ నౌకలు ఉంటాయి. మొత్తం 4వరుసల్లో ఈ నౌకలు, జలాంతర్గాములు సముద్రంలో లంగరు వేసి ఉంచారు. వీటిని పరిశీలిస్తూ రాష్ట్రపతి నౌకా కాన్వాయ్ ముందుకు సాగుతుంది. రాష్ట్రపతి నౌక వెళ్లే సమయంలో మిగిలిన నౌకల్లో ఉండే సిబ్బంది గౌరవ వందనం సమర్పిస్తారు. దేశంలో రిపబ్లిక్ డే పెరేడ్ తర్వాత అంత పెద్ద స్థాయిలో జరిగే కార్యక్రమంగా పీఎఫ్ఆర్‌ను పరిగణిస్తారు.
రాష్ట్రపతి పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ..
దేశ నౌకదళ బలాన్ని సమీక్షించే కార్యక్రమం రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ. సాధారణంగా రాష్ట్రపతి పదవీ కాలంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన యుద్ధనౌక నుంచి నాలుగు వరసల్లో మోహరించిన 44 నౌకలని పరిశీలిస్తారు. ఇది విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మూడో ఫ్లీట్ రివ్యూ. చివరగా 2016లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఈసారి ప్లీట్ రివ్యూ ప్రత్యేకమైనది.
ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేయనున్న రాష్ట్రపతి..
మధ్యాహ్నం 12 గంటల వరకు ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేస్తారు. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కి ఆతిథ్యమిచ్చిన తూర్పు నౌకాదళం ….మళ్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకి ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం 10 వేల మందికి పైగా నావికులు, సిబ్బంది ఈ రివ్యూలో పాల్గొంటున్నారు.
పాల్గొనే యుద్ధనౌకలు..
ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐ.ఎన్.ఎస్. వేలా జలాంతర్గామి, ఐ.ఎన్.ఎస్. చెన్నై, ఐ.ఎన్.ఎస్. దిల్లీ, ఐ.ఎన్.ఎస్. తేజ్, శివాలిక్ శ్రేణి యుద్ధనౌకలు మూడు, కమోర్తా యుద్ధనౌకలు మూడు, కోస్ట్‌గార్డ్, ఎన్.ఐ.ఒ.టి., షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన నౌకలు పీఎఫ్‌ఆర్‌లో పాల్గొంటున్నాయి.
- చేతక్, ఏఎల్‌హెచ్., సీకింగ్, కమోవ్ హెలికాప్టర్లు, డోర్నియర్, ఐ.ఎల్.-38ఎస్.డి., పి8ఐ, హాక్, మిగ్ 29కే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో సముద్ర మధ్యన విన్యాసాలు చేస్తాయి.
ఇదీ చదవండి: MatsyaKara Abhyunnathi Sabha: జీవో 217ను చించేస్తున్నా.. మత్స్యకారుల కోసం జైలుకైనా వెళ్తా: పవన్ కల్యాణ్