అటవీ హక్కుల పత్రాలు పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్‌కు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశించారు. జోరువానలో రెండో రోజు ప్రభుత్వ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గిరిజన సంక్షేమ సంచాలకుడు రంజిత్ భాషాతో కలిసి విశాఖ జిల్లా చింతపల్లి, గూడెం కొత్తవీధి లలో సుడిగాలి పర్యటన చేశారు. కాలినడకన వీఎస్ఎస్ పోడు భూములను, కాఫీ తోటలను అధికారుల బృందం పరిశీలించింది. కందులగాది పెదబరడ, చౌడుపల్లి గ్రామాల్లో వారు పర్యటించారు. గూడెం కొత్తవీధి పంచాయతీ గుమ్మల్లగొంది కాఫీ తోటలు, చాపగెడ్డ ఏపీఎఫ్‌డీసీ కాఫీ ఎస్టేట్‌ను పరిశీలించారు. కాఫీ రైతులతో కాసేపు ముచ్చటించారు.
ఏడాదికి కాఫీ, మిరియాలు సాగుపై వస్తున్న ఆదాయం, ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాల వివరాలను ప్రవీణ్ ప్రకాష్ అడిగి తెలుసుకున్నారు. అలాగే కాఫీ వీడింగ్ సస్యరక్షణ పనులు, కాఫీ దిగుబడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చింతపల్లి మండలం సిరిపురం గ్రామం నుంచి కొండపైకి సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి తోటలు పరిశీలించి రైతులతో ముచ్చటించారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని అవసరముందని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు. విశాఖ ఏజెన్సీ నుంచి హెలికాప్టర్ లో నర్సీపట్నం చేరుకొని అక్కడ ధర్మసాగరం వద్ద ఏర్పాటు చేసిన ఇళ్ల స్థలాలను పరిశీలన చేశారు ఇదే క్రమంలో ఇళ్ల స్థలాలపై వేసిన లేఅవుట్లలోనూ మొక్కల పెంపకం చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ధర్మసాగర్ హెలిప్యాడ్ నుంచి నేరుగా అమరావతి పయనమయ్యారు.
ఇదీ చదవండి: కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ