Political Leaders React On CM Jagan Comments : సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని.. అక్కడే కాపురం పెట్టబోతున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద గ్రీన్‌పీల్డ్ పోర్టు నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నౌపడలో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు ఘాటుగా స్పందించారు.
జగన్ అహంభావానికి పరాకాష్ట : సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోమారు ప్రకటించడం కోర్టు ధిక్కారానికి నిదర్శనమని, ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును అగౌరవ పరచడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కె.రామకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుండి విశాఖ నుంచే పాలన ప్రారంభించనున్నట్టు స్పష్టం చేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు. అమరావతినే రాజధానిగా గుర్తించి, అభివృద్ధిపరచాలని సాక్ష్యాత్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు.
దీనికితోడు మూడు రాజధానుల బిల్లును కూడా అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని కె.రామకృష్ణ అన్నారు. ఇటీవల పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి పరాభవం ఎదురయ్యిందని ఆయన గుర్తు చేశారు. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా ఏపీకి విశాఖ రాజధాని కాబోతుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం ఆయన అహంభావానికి పరాకాష్టగా పేర్కొనవచ్చని ఆయన అన్నారు.
కాపురం పెడితే పాలన వికేంద్రీకరణ కాదు : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాపురం పెట్టడమే వికేంద్రీకరణా అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశ్నించారు. మూడు రాజధానులు.. విశాఖ రాజధాని అంటే ఇంకేంటో అనుకున్నామని ఎద్దేవా చేశారు. కాపురం పెడితే పాలనా వికేంద్రీకరణ కాదని తెలిపారు.
ఎవరు విశాఖలో కాపురం పెట్టమని చెప్పారు జగన్ : మూడు రాజధానులు అంటే మూడు చోట్ల కాపురం పెట్టడమని సీఎం జగన్ భావిస్తున్నాడా అంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిన విజయ్ కుమార్ విశాఖలో కాపురం పెట్టమన్నాడా? లేక స్వరూపానంద చెప్పాడా అని ఆమె నిలదీశారు. ఆనాడు ఇడుపులపాయలో కాపురం పెట్టి అక్కడ భూములు కొట్టేశారనీ ఆరోపించారు. అమరావతిలో కాపురం పెట్టి ఇక్కడ భూములు ఇచ్చిన రైతులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని అనురాధ ధ్వజ మెత్తారు. ఇప్పుడు విశాఖ వెళ్ళకుండానే ఋషికొండను బొడిగుండు చేసి, మళ్లీ కాపురం పెట్టి ఏం సాధిస్తారని ఆమె ప్రశ్నించారు.
ఇవీ చదవండి