GANJA SEIZED FROM AU SECURITY STAFF : విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెక్యూరిటీ సిబ్బంది వద్ద గంజాయి దొరకడం కలకలం రేపింది. విశ్వవిద్యాలయ సిబ్బంది గంజాయిని విద్యార్థులకు రహస్యంగా విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి ఆర్కే బీచ్ రోడ్డులోని యోగా విలేజ్ వద్ద ఆగి ఉన్న ఆటోను విశాఖ మూడో పట్టణ సీఐ రామారావు, ఎస్సై సంతోష్ కుమార్ కలిసి తనిఖీ చేశారు.
ఆ తనిఖీల్లో చిన్న పొట్లాల్లో గంజాయిని గుర్తించారు. అక్కడే ఒకరిని పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఓ వ్యక్తిని శివాజీపాలెంలోని ఏయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు సమీపంలో, మరో వ్యక్తిని బీచ్ రోడ్డులో పట్టుకున్నారు. వీరిని చంద్రమౌళి, సురేశ్, అప్పలరాజుగా పోలీసులు గుర్తించారు. వీరంతా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వారేనని తేల్చిచెప్పారు. చంద్రమౌళి.. వర్సిటీ సెక్యూరిటీ వ్యవహారాలను పర్యవేక్షించే ఒక కీలక అధికారికి వ్యక్తిగత డ్రైవర్గా పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే విశ్వవిద్యాలయంలోనే విద్యార్థుల వసతి గృహాలు ఉండటంతో గంజాయిని వారికి సరఫరా చేస్తున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పట్టుబడిన వ్యక్తుల్లో ఇద్దరికి గంజాయి తాగే అలవాటున్నట్లు సమాచారం. దాడుల సమయంలో అరకిలో దొరికినట్లు పోలీసులు కేసు నమోదు చేయగా.. మొత్తంగా ఐదు కిలోల వరకు దొరికినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో చాలా మంది ప్రమేయం ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. పోలీసులు విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: