రాష్ట్రంలో ఆన్లైన్ రమ్మీని నిషేధించడంతో గాజువాకలో సెల్ఫోన్ దుకాణం నిర్వహిస్తున్న కారే తాతారావు అనే వ్యక్తి ఆన్లైన్లో రమ్మీ ఆడే వారి కోసం నకిలీ సిమ్ కార్డులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు డీసీపీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. ఆ సిమ్ కార్డులతో నకిలీ జీపీఎస్ యాప్ ద్వారా రమ్మీ ఆడేందుకు అవకాశం ఉండడాన్ని గుర్తించాడు.
ముగ్గురు స్నేహితుల ద్వారా గాజువాక చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే పేదవారికి 300 రూపాయలు ఇచ్చి వారి వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డు, కేవైసీలను తీసుకునేవాడు. పాన్ కార్డు లేనివారికి తానే అప్లై చేసి మరీ సమకూర్చుకునేవాడు. ఆ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులను యాక్టివేట్ చేయించి ఆన్ లైన్ ద్వారా రాష్ట్రంలో రమ్మీ ఆడాలనుకునే వారికి 3వేల రూపాయల చొప్పున అమ్మేవాడు. రెండు రోజుల క్రితం విశాఖ న్యూపోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వారి వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డు నకళ్లను తీసుకుని డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. ప్రజలెవ్వరు తమ ధ్రువపత్రాలను ఇతరులకు ఇవ్వవద్దని డీసీపీ రస్తోగి తెలిపారు. వాటి ద్వారా వారు ఎటువంటి నేరాలకు పాల్పడతారో తెలియదని.. తద్వారా సమస్యల్లో చిక్కుకోవద్దని ఆమె కోరారు. నిందితులు నలుగురిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టి అరెస్ట్ చేశామని వారి వద్ద నుంచి 40 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి వద్ద నుంచి సిమ్ లను కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఏపీలో ఆన్లైన్ రమ్మీ నిషేధం ఉండడం వలన ఫేక్ జిపిఎస్ ద్వారా ఆడిన గంట తర్వాత ఆ సిమ్ కార్డు అసలైన లొకేషన్ ని గుర్తించడంతో ఆటోమేటిక్ గా బ్లాక్ అయిపోతుందని డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండీ.. BC Janardhana reddy: మాజీ ఎమ్మెల్యే బి.సి.జనార్దనరెడ్డికి బెయిల్ మంజూరు