మావోయిస్టు కీలక నేతను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం కుంకుమపూడికి చెందిన గెమ్మెలి కామేష్ అలియాస్ హరి అలియాస్ వసంత అజ్ఞాతంలో ఉండి వందలాది హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నాడు. 'గిరిజనుడివై ఉండి గిరిజనులనే హతమారుస్తున్నావు’ అంటూ హరికి వ్యతిరేకంగా గోడప్రతులు వెలిశాయి. మూడేళ్లుగా తూర్పు డివిజన్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో.. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపుచర్యలు చేపట్టారు.
కొరకరాని కొయ్య!
గతేడాది మాదిమళ్లు, నేలజర్త వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో హరి హతమయ్యాడనే వదంతులు సంచలనం సృష్టిచాయి. మృతదేహాలు వచ్చిన తరువాత అతడు అక్కడ నుంచి తప్పించుకున్నట్లు తేలింది. ఏవోబీలో సుమారు 30 మంది మావోయిస్టులు బలైన రామ్‌గుడా ఎన్కౌంటర్లోనూ త్రుటిలో బయటపడ్డాడు. తూర్పు డివిజన్‌లో మావోయిస్టులకు కీలకంగా ఉండే గాలికొండ ఏరియా కమిటీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ నేతలు కామేష్ను ఇక్కడ నియమించారు. అతడి నేతృత్వంలో స్థానిక విభాగం విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించసాగింది. ఒకరకంగా పోలీసులకు హరి కొరకరాని కొయ్యగా మారాడు.
ఎట్టకేలకు...
కామేష్ కదలికలపై దృష్టిపెట్టిన పోలీసులు.. జీకేవీధి మండలంలోని ఓ అటవీ ప్రాంతంలో అతడు సంచరిస్తున్నట్లు తెలుసుకున్నారు. సమయస్ఫూర్తితో వలపన్ని హరిని సజీవంగా పట్టుకోగలిగారు. ఈ అరెస్టుతో గాలికొండ ఏరియా కమిటీ మరింత బలహీనమవ్వగా.. తూర్పు డివిజన్‌లో మావోయిస్టుల కదలికల్లో దూకుడు కొంత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 'గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు'