పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మలపాలలో తెదేపా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయరాజ్, వార్డు సభ్యుల తరుపున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి జగన్ ఈ రెండేళ్ల కాలంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో వైకాపా నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకొని పంచాయతీలో ఓటు కావాలని వైకాపా నాయకులు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏమైందని ప్రశ్నించారు. గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.