జీవీఎంసీ పాలక మండలి ఏర్పడి మూడు నెలలు గడవకముందే ఆస్తి పన్ను పెంచాలనే ఆలోచన చేయడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. చాలామందికి ఉపాధి కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి పన్ను పెరిగితే.. ప్రజలపై మరింత భారం పడనుంది. సౌకర్యాలు కల్పించాల్సిన నగరపాలక సంస్థ ఇలా పన్నులు పెంచితే కష్టమంటున్నారు నగరవాసులు.
భూమి విలువ, స్థలం మార్కెట్ విలువ లెక్కగట్టి దానిపై ఆస్తి పన్ను విధించే విధానం ద్వారా పెద్దఎత్తున ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని వివిధ పార్టీల నేతల అంటున్నారు. ప్రజలపై అదనంగా 700 కోట్ల రూపాయల భారం పడుతుందని చెబుతున్నారు.
విశాఖ ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లు ఉన్నా... వారిని సంప్రదించకుండా రాత్రికిరాత్రే నోటిఫికేషన్ ఇచ్చి పన్నులు పెంచాలనుకోవడం నగరవాసులను నడి సంద్రంలో ముంచడమేనని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఆస్తి పన్ను పెంపుపై సమగ్రమైన చర్చ జరగాలంటున్న విశాఖ వాసులు... ప్రజాభిప్రాయం మేరకు మహానగరపాలక సంస్థ నడుచుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి