విశాఖ జిల్లా అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయమే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. సమయం మించిపోతే అల్లర్లు జరుగుతాయోమోననే భయంతో కొన్ని వర్గాల వారు ఉదయమే ఓటు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్లను అభ్యర్థులు ఆటోల్లో తీసుకొచ్చారు. గుర్తింపు కార్డు తప్పనిసరి చేయడంతో కొందరు వెనుతిరిగారు.
ఎలమంచిలిలో....
ఎలమంచిలి నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది ఉదయాన్నే చలి ఎక్కువగా ఉండడంతో ఓటు వేయడానికి ఎక్కువమంది రావడం లేదు. మత్స్యకార గ్రామమైన పూడిమడక లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనకాపల్లిలో...
అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 5,97,889 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,92,792 పురుషులు ఉండగా....3,05,073 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అనకాపల్లి మండలం తుమ్మపాలలో ఓ వృద్ధురాలు ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. నడవడానికి సత్తువ లేకపోయినా మనవరాలి సాయంతో కేంద్రానికి చేరుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. 12 మండలాల్లో ఉదయం 11 గంటలకి 41 శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చోడవరంలో...
చోడవరం నియోజకవర్గంలో బుచ్చెయ్యపేట మండలంలోని మల్లాం, చోడవరం మండలంలోని లక్ష్మీ పురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా, తెదేపా కార్యకర్తలు బాహబాహికి దిగారు. ఇరు వర్గాలను శాంతింపచేసేందుకు అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారంటూ ఓటర్లు ఆరోపించారు. చోడవరంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు ఉత్సహంగా వచ్చారు.
మాడుగులలో.....
మాడుగుల నియోజకవర్గంలోని మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ ఎత్తున తరలివచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవరాపల్లి మండలం తారువలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చీడికాడ మండలం అప్పలరాజుపురంలో మాజీ ఎమ్మెల్యే, తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడు దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఇదీ చదవండి