విశాఖ మన్యంలో కాల్సైట్ ఖనిజం తవ్వకాలకు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పిలిచిన టెండర్లు వివాదాస్పదం అవుతున్నాయి. టెండరు నిబంధనలపై గిరిజన సంఘాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. అనంతగిరి మండలం నిమ్మలపాడు గ్రామ పరిధిలో 8.725 హెక్టార్లు, 24 హెక్టార్లలో రెండు లీజులను గతంలో ఏపీఎండీసీకి కేటాయించారు. వీటిలో దాదాపు 1.20 కోట్ల మెట్రిక్ టన్నుల కాల్సైట్ ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు లీజుల్లో ఖనిజ తవ్వకాలు, విక్రయాలకు ఏపీఎండీసీ గత నెలలో టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 9తో గడువు ముగియాల్సి ఉండగా, 15 వరకు పొడిగించారు.
కాల్సైట్‌కు గనులశాఖ సీనరేజ్ రుసుము టన్నుకు రూ.90 ఉండగా, దీనికి ఒకటిన్నర రెట్లు అదనంగా టన్నుకు రూ.225ను కనీస ధరగా ఏపీఎండీసీ ఖరారు చేసింది. దీనికంటే ఎవరు ఎక్కువ చెల్లిస్తామని కోట్ చేస్తే వారికి టెండర్లు దక్కుతాయి. ఈ మొత్తంతోపాటు, ప్రతి టన్నుకు సీనరేజ్ ఫీజు, జిల్లా ఖనిజ నిధి, మెరిట్ అదనంగా గనులశాఖకు చెల్లించాలి. ఈ లీజులు ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో గిరిజనులు వ్యక్తిగతంగా (ట్రైబల్ ఇండివిడ్యువల్స్) టెండర్లలో పాల్గొనేలా నిబంధన విధించారు. గిరిజనులు భాగస్వాములుగా ఉన్న సంస్థలకు అవకాశం ఇవ్వలేదు.
'గ్రామసభ లేదు.. సొసైటీలకు అవకాశమివ్వలేదు'
ఈ రెండు లీజుల్లో తవ్వకాలకు సంబంధించి స్థానికంగా గ్రామసభ నిర్వహించి ప్రజల ఆమోదం, గ్రామసభ తీర్మానం పొందలేదని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. గిరిజనులు వ్యక్తిగతంగా మాత్రమే టెండరు వేయాలనడం, వారు భాగస్వాములుగా ఉన్న సంస్థలకు అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని కొన్ని గిరిజన సొసైటీలు ప్రశ్నిస్తున్నాయి. 8.725 హెక్టార్ల టెండరుపై అనంతగిరి మండలానికే చెందిన శ్రీ అభయ గిరిజన మ్యూచువల్లీ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ దీనిపై హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై పూర్తి వివరాలు అందించేందుకు మూడు వారాలు గడువు కావాలని ఏపీఎండీసీ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించారు. అప్పటి వరకు ఈ టెండరుపై ముందుకెళ్లొద్దని రెండు రోజుల కిందటే కోర్టు ఆదేశించినట్లు చెబుతున్నారు. 8.725 హెక్టార్ల లీజుకు పదేళ్ల కిందటే గ్రామసభ తీర్మానం పొందామని, దీనికి పర్యావరణ, అటవీ అనుమతులు సైతం వచ్చాయని ఏపీఎండీసీ అధికారులు చెబుతున్నారు. కాల్సైట్‌ను పెయింటింగ్ పరిశ్రమ, టూత్‌పేస్టుల తయారీ, చేపల ఆహారం, పేపరు తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తారు.
ఇదీ చదవండి:
ఆ 6 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్లో.. ఇకపై వాహనాలు దూసుకెళ్తాయి!