విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిశోధన పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లేక ప్రైవేటు సంస్థల వైపు చూస్తున్నారు. అధ్యాపకుల కొరత ఉంటే.. యూజీసీ నిధులపై ప్రభావం పడే అవకాశముందని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.
పరిశోధన పూర్తి చేసినా.. అంతే..
ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పరిశోధన పూర్తి చేసి.. ఎన్నో ఏళ్ల నుంచి వందలాది పరిశోధకులు ఎదురుచూస్తున్నారు. అధ్యాపక నియామకాలు ఎప్పుడో ఒకప్పుడు భర్తీ చేస్తారని ఆశగా ఎదురుచూస్తునారు. అప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకోవడానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చివరిసారిగా 2006లో మాత్రమే కొన్ని నియామకాలు చేశారని ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో కష్టాలు ఎదురుకుంటున్నామని.. ఈ సమయంలో కొన్ని పోస్టులను విశ్వ విద్యాలయం భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చూడితే ఒక తరం పరిశోధకులకు న్యాయం చేసినట్టు అవుతుంది అంటున్నారు. పరిశోధన పూర్తి చేసి అర్హత సంపాదించిన ఉద్యోగ నియామకాలు జరగక ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్లిపోతున్నట్టు చెప్పారు. విశ్వ విద్యాలయంలో అధ్యాపకుల కొరత ఉంటే యూజీసీ నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
ప్రణాళిక సిద్ధమవుతోంది
ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏళ్ల చరిత్ర ఉంది. ఏటా సుమారు లక్షా డెబ్బై వేల మంది విద్యార్థుల విద్యనభ్యసిస్తున్నారు. కానీ అధ్యాపకుల నిష్పత్తి చూస్తే విద్యార్థుల సంఖ్యలో ఒకటో వంతు కూడా రావడం లేదు. 1994 నుంచి 2004 వరకు అసలు నియామక ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం అమలు చేసింది. ఆ తరవాత మళ్లీ మొదలు పెట్టినా.. కోర్ట్ సమస్యలు వచ్చి ఈ రోజుకు కూడా అధ్యాపక నియామకం జరగలేదు. 2006లో మాత్రమే కొన్ని నియామకాలు చేశారు. ఒక్క ఆంధ్ర విశ్వ విద్యాలయంలో 750 మంది అధ్యాపకుల కొరత ఉంది. పరిశోధకులు పెరగాలంటే అధ్యాపకులు సంఖ్య ఎక్కువ ఉండాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ అంశం దృష్టి పెట్టి అధ్యాపక భర్తీ కి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తునట్టు ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి చెబుతున్నారు.
అధ్యాపకులు ఉంటేనే మేలు
దేశంలో పేరు పొందిన ఐఐటీ విద్యా సంస్థలో సైతం అధ్యాపక కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తునట్టు నిపుణులు అంటున్నారు. ఇప్పుడు కొవిడ్ సమయంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల జరుగుతున్నాయి. కనీసం ఈ సమయంలో అధ్యాపకులు ఉంటే విద్యార్థులకు మేలు జరుగుతుంది అంటున్నారు. అధ్యాపకులు ఉంటేనే పరిశోధనలు పెరిగి విశ్వ విద్యాలయాలు లక్ష్యం నెరవేరుతుందని విద్యవేత్తలు అంటున్నారు.
ఇదీ చదవండి: మరి కొన్ని గంటల్లో.. పెను తుపానుగా బలపడనున్న నివర్!