విశాఖ మహానగర పాలక సంస్థ కొత్త కమిషనర్గా నాగలక్ష్మి బాధ్యతలు చేపట్టడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహానగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో.. కమిషనర్ సృజనను పదవి నుంచి తప్పించడం చర్చనీయాంశమైన సమయంలోనే.. ఇన్ఛార్జి కమిషనర్ కోటేశ్వరరావుకి బాధ్యతలు అప్పగించారు. ఆయన హయాంలోనే ఎన్నికలు జరుగుతాయని తొలుత అంచనా వేసినప్పటికి.. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయి కమిషనర్ ఉండాలని ప్రభుత్వాన్ని నిర్దేశించడంతో సృజన బదిలీ తప్పలేదు.
ఆమె మొదట నెల రోజుల పాటు సెలవులు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈపీడీసీఎల్ సీఎండీగా ఉన్న నాగలక్ష్మి.. జీవీఎంసీ కమిషనర్గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె విశాఖలో బాధ్యతలను చేపట్టారు.
నగరంలో 98 వార్డుల కోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తై... దానికి కొనసాగింపుగా ఉపసంహరణ ఘట్టం మొదలు కానుంది. ఎనిమిది జోన్లు ఉన్న విశాఖ మహానగర పాలక సంస్థ అనకాపల్లి
భీమిలి విలీనం తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి.
భీమిలి - అనకాపల్లి నడుమ మహానగర పాలక సంస్థ విస్తరించడం.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ప్రభుత్వం ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలని తల పెట్టడం వెరసి ఇవన్నీ ఈ ఎన్నికల ప్రాధాన్యతను పెంచేశాయి.
ఈ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం అధికార పార్టీ క్షేత్ర స్థాయిలో వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. విశాఖ నగరంలో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న తెలుగుదేశం శ్రేణులు కూడా నగరంపై తమ పట్టును నిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇదీ చదవండి: జీవీఎంసీ దర్జా.. 85 శాతం సొంతంగా...!