జీవీఎంసీ ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉన్న తరుణంలో.. వైకాపా నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీ కేడర్ తో.. సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్ష నిర్వహించారు. వైకాపా మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్దిలపాలెం వైకాపా నగర కార్యాలయంలో.. విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, గాజువాక నియోజకవర్గ నేతలు, పలువురు కార్పొరేటర్ అభ్యర్థులతో వేర్వేరుగా సమీక్ష చేశారు. 98 స్థానాలకు గాను 90లో వైకాపా విజయం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైకాపాను గెలిపిస్తాయని చెప్పారు. త్వరలో డివిజన్ల వారీగా పర్యటన చేస్తానని తెలిపారు. సమీక్షా సమావేశంలో నియోజకవర్గ నేతలతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే టి.నాగిరెడ్డి, నాలుగు నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
హైకోర్టు తరలింపు...
కర్నూల్‌కు హైకోర్టు తరలించే విషయంలో కేంద్రం తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. హైకోర్టు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందనీ... న్యాయ స్థానం తీర్పు వెలువడించిన తర్వాత కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
ఇదీ చదవండి:
'ఆంధ్రుల హక్కు'కు ముప్పు తప్పదా?.. గనులు కేటాయించి సమస్య పరిష్కరించలేరా?!