విశాఖ మధురవాడలోని బక్కనపాలెంలో కేంద్ర ఇంటలిజెన్స్ ఎస్పీ మధుకు చెందిన స్థలంలో ప్రహరీ నిర్మాణాన్ని ఆపేసిన ఘటనపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. తానూ ఎవరి స్థలాన్ని ఆక్రమించలేదని స్పష్టం చేశారు. రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మిస్తుంటే స్ధానికుల సమాచారం మేరకు ఆపమని పోలీసులను కోరానని అన్నారు. ప్రజల సౌకర్యం కోసమే కల్వర్టును నిర్మించామన్నారు. ఎస్పీ మధు స్థలానికి అన్ని అనుమతులు ఉంటే.. ఆయన ఏ నిర్మాణమైనా చేసుకోవచ్చునన్నారు. ప్రహరీ నిర్మాణానికి కూడా జీవీఎంసీ అనుమతి ఉండాలని ఎంపీ వ్యాఖ్యానించారు.
వివాదం ఏంటంటే..: విశాఖ నగరం మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డును మూసేసి, దాని మధ్యలో ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఈ రోడ్డుకు బదులుగా మురుగు కాలువపై అనుమతి లేకుండానే కల్వర్టు నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న తన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టగా ఎంవీవీ వెంచర్స్‌కు చెందిన మనుషులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారంటూ.. ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ అధికారినైన తన స్థలానికే దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన మధు.. ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
"గాయత్రినగర్ రోడ్డు నంబరు 9లో మా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గతంలో 168 గజాల స్థలం కొన్నాం. చాలాకాలంగా ఖాళీగా ఉంది. ఇటీవలే ఇంటి నిర్మాణం కోసం జీవీఎంసీ అనుమతి తీసుకున్నాం. అందులో కొంత స్థలం ప్రభుత్వానిది ఉంటే మిగిలిన ప్రాంతంలోనే పనులు ప్రారంభించాం. పునాదులు తవ్వేందుకు మట్టి పనులు మొదలుపెట్టగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన సిబ్బంది వచ్చి కార్మికులపై బెదిరింపులకు దిగారు. కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థిరాస్తిలో నా ప్రమేయం లేకుండానే రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఎలాంటి పనులూ చేయొద్దని హెచ్చరించారు. గతంలోనే ఈ లేఅవుట్‌లో ప్రజల అవసరాలకు కోసం వేసిన రోడ్డును కబ్జా చేశారు. జీవీఎంసీ నిర్మించిన మురుగు కాలువలనూ ఆక్రమించారు. వెంచర్‌కు నైరుతి వైపున మురుగు కాలువపై అనధికారికంగా వంతెన నిర్మించారు. అక్కడి నుంచి మా స్థలం మీదుగా రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంవీవీ మనుషులమంటూ వచ్చిన వారి కారణంగా నా ఇంటి నిర్మాణం నిలిచిపోయింది. నాకు న్యాయం చేయాలి" అని ఎస్పీ కోరారు. ఎంపీ తన వెంచర్ కోసం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు.
ఇదీ చదవండి: SP alligations on MP: నా స్థలాన్నీ కాజేయాలని చూస్తున్నారు... ఎంపీపై ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరోపణలు..!