విశాఖపట్నం జిల్లా సబ్బవరం వద్ద లారీ బైక్‌ను ఢీ కొట్టిన ఘటనలో తల్లీ , కుమారుడు మృతి చెందారు. జిల్లాలోని కె.కోటపాడు మండలం వారాడకు చెందిన అన్నదానపు అప్పలరాజు, భార్య అచ్చియ్యమ్మ(34), కుమారులు రాము, లక్ష్మణ(కవలలు)(9) అనకాపల్లి మండలం కోడూరులో ఉంటున్నారు. వీరికి వారాడలో ఇంటి స్థలం పట్టా మంజూరైంది. శనివారం వారాడ వెళ్లి పట్టా తీసుకుని ఒకే మోటారు సైకిల్‌పై కోడూరు వస్తున్నారు.
సబ్బవరం మెయిన్‌రోడ్డు పక్కన కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా.. ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు సైకిల్ హ్యాండిల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న భార్య అచ్చియ్యమ్మ, కుమారుడు రాము రోడ్డుపై పడిపోయారు. అప్పలరాజు, మరో కుమారుడు లక్ష్మణ రెండోవైపు పడిపోయారు. లారీ వెనుక చక్రాల కింద నలిగిన రాము అక్కడికక్కడే చనిపోగా, అచ్చియ్యమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందిందని మృతురాలి బంధువు నారాయణ తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. కళ్ల ముందే కుమారుడి విగతజీవిగా పడి ఉండటం చూసి తండ్రి అప్పలరాజు కూలబడిపోయాడు. ఇంటి పట్టా కోసం ఆనందంతో వెళ్లామని, ఆ ఆనందం గంట కూడా నిలవలేదని, భార్య, కొడుకును పోగొట్టుకున్న దురదృష్టవంతుడినని గుండెలు పగిలేలా రోదించిన అప్పలరాజును చూసి స్థానికులు కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు.
ఇదీ చదవండి: