నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి వాటికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను కట్టడి చేశామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో జిల్లా అధికారులు, 21 కమిటీల ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
* కంటైన్‌మెంట్ జోన్‌లో పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఇక నుంచి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలని పోలీసు అధికారులకు మంత్రులు సూచించారు. సమీక్ష తర్వాత మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, కలెక్టర్ వినయ్‌చంద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
* నగరంలో ఏడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించామని, అందులో 2,06,327 కుటుంబాలు, 7,28,961 జనాభా ఉన్నారని చెప్పారు. ఇదేమీ కర్ఫ్యూ కాదని, ఆయా ప్రాంత వాసులు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. అలాగని బయటకు వస్తే నేరమేమీ కాదని, ఈ విషయమై సంయమనం పాటించాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు.
* కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాల్లో శనివారం పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపనున్నామని చెప్పారు. ఇబ్బందులు ఎదురైతే కంట్రోలు రూమ్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
* పాయకరావుపేటలో పాజిటివ్ కేసు నమోదైనందున ఆ ప్రాంతాన్నీ కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించామని చెప్పారు. పీపీఈలు, మాస్కులు, గ్లౌజుల కొరత లేదని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, యంత్రాంగం సన్నద్ధత, కార్యాచరణపై తెదేపా, భాజపా సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
* కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ కేంద్ర ఆదేశాల మేరకు కంటైన్‌మెంట్ జోన్‌లో 28 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
రూ. 6.52 కోట్ల సహాయం: ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు పీఎం సహాయ నిధికి రూ.1.55 లక్షలు, సీఎం సహాయ నిధికి రూ.2.18 కోట్లు, కలెక్టర్ సహాయ నిధికి రూ.4.31 కోట్లు వెరసి మొత్తం రూ.6.52 కోట్లు వచ్చిందన్నారు. వీటితో పాటు పలు సంస్థలు మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి అందజేశాయన్నారు. జిల్లాలో 4,800 మంది నిరాశ్రయులున్నట్లు గుర్తించామని, వీరి కోసం ఎస్‌ఈజెడ్‌లో ప్రత్యేకంగా ఒక షెల్టరు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
* మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు బుద్ధ నాగజగదీశ్వరరావు, పి.వి.ఎన్. మాధవ్, ఎమ్మెల్యేలు కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, వెలగపూడి రామకృష్ణబాబు, తిప్పల నాగిరెడ్డి, గణబాబు, గొల్ల బాబూరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్‌రాజ్, కమిషనర్ సృజన, జేసీలు శివశంకర్, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాలు..
* అల్లిపురం * రేవడి * ముస్లింతాటిచెట్లపాలెం * రైల్వేన్యూకాలనీ
* నర్సీపట్నం * గాజువాక * పూర్ణామార్కెట్
ఇదీ చూడండి: పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎం జగన్